వెంకయ్య "గండం" గడించింది..

ముప్పవరపు వెంకయ్యనాయుడు..రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయస్థాయిలోనూ ఈ పేరు తెలియని వారుండరు. మూడు దశాబ్ధాలుగా జాతీయ రాజకీయాలను ప్రభావితం చేస్తున్న వ్యక్తి. అలాంటి ఆయన తొలిసారి తన రాజకీయ భవిష్యత్ ఏమవుతుందోనని టెన్షన్ పడ్డారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు వెంకయ్య. అయితే జూన్ 30తో ఆయన రాజ్యసభ పదవీ కాలం ముగుస్తుంది. మరోసారి రాజ్యసభకు ఎన్నికైతేనే ఆయన మంత్రిగా కొనసాగగలరు. లేదంటే ఆయనకు పవర్ దూరమైనట్టే. ప్రస్తుతం కర్ణాటక నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వెంకయ్యకు ఈ సారి ఏపీ నుంచి ఛాన్స్ ఉంటుందని తొలుత ప్రచారం జరిగింది. అయితే ఆ బెర్త్ నిర్మలా సీతారామన్‌కు కన్ఫామ్ అయింది..ఇప్పటి వరకు కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎన్నికవుతూ వచ్చిన వెంకయ్యకు ఈ దఫా అక్కడి నుంచి కూడా టిక్కెట్ లేదన్న వార్తలు రావడంతో వెంకయ్యకు బీపీ లెవల్స్ పెరిగిపోయాయి.

 

కష్టకాలంలో బీజేపీకి జాతీయాధ్యక్షుడిగా వ్యవహరించి పార్టీని కాపాడిన వెంకయ్య లాంటి నేతను వదులుకునేందుకు మోడీ సిద్ధంగా లేరు. అందుకే ఆయనను మరోసారి కన్నడ గడ్డ నుంచే రాజ్యసభకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది. ఆ బాధ్యతను కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్పకు అప్పగించింది. అధిష్టానం ఆదేశాలతో రంగంలోకి దిగిన యడ్డీ పార్టీ ముఖ్యనేతలతో బెంగుళూరులో సమావేశమై వెంకయ్య వ్యవహారాన్ని చర్చించారు. ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీలో బీజేపీకి 44 మంది సభ్యుల బలం ఉంది. దీంతో ఇక్కడి నుంచి ఒకే ఒక్క రాజ్యసభ సీటు దక్కే అవకాశముంది. ఆ ఒక్కటి వెంకయ్యకే ఇవ్వాలని సమావేశం తీర్మానించింది. ఈ నిర్ణయంతో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరపడింది.