రాజన్‌కు రెండవ ఛాన్స్..!

రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్‌పై బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన్ను ఆ పదవిలో ఉంచుతారా..? లేదంటే ఉద్వాసన తప్పదా..అంటూ బ్యాంకింగ్‌తో పాటు దేశ ఆర్థిక నిపుణులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్‌తో ఆర్‌బీఐ గవర్నర్‌గా రఘురాం రాజన్ పదవికాలం ముగుస్తుంది. దీంతో ఆయనకు రెండోసారి అవకాశమివ్వకపోవచ్చని జోరుగా ప్రచారం జరుగుతోంది.  అమెరికా గ్రీన్ కార్డ్ పొందిన రాజన్..మానసికంగా భారతీయుడు కాదని, భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి పథంలో వెళ్లకుండా రాజన్ అడ్డుకున్నారని, తక్షణం ఆయనను ఆర్‌బీఐ గవర్నర్ జనరల్‌ బాధ్యతల నుంచి తొలగించాలని ప్రధాని మోడీకి సుబ్రమణ్యస్వామి లేఖ రాశారు.

 

స్వామి వ్యాఖ్యలు..ఆర్‌బీఐ కొత్త గవర్నర్ నియామకం తదితర అంశాలపై ప్రధాని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీతోనూ..ఆర్థిక రంగ నిపుణులతోనూ చర్చించారు. అయితే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ చీఫ్‌ ఎకనమిస్ట్‌గా పనిచేయడంతో పాటు..2008 ఆర్థిక సంక్షోభాన్ని ముందుగానే ఊహించి భారత్‌ను పెను ప్రమాదంలోంచి రక్షించిన ఘనత రాజన్ సొంతం. అధికారంలోకి వస్తూనే అనేక సంస్కరణలు తీసుకువచ్చి బ్యాంకింగ్ రంగాన్ని జెట్ స్పీడుతో పరుగులెత్తించారు. ఆయన పనితీరును గుర్తించిన వరల్డ్ బ్యాంక్ మ్యాగ్‌జైన్ రాజన్‌ను కేంద్ర బ్యాంక్ ఉత్తమ గవర్నర్‌గా కొనియాడింది. అటువంటి ట్రాక్ రికార్డు కలిగిన రాజన్ పట్ల స్వామి వ్యాఖ్యలు ఏ మాత్రం ప్రభావం చూపించలేవని స్పష్టమవుతోంది. దీనికి తోడు రాజన్ పనితీరును సాక్షాత్తూ ప్రధాని ప్రశంసించడంతో పాటు దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు కూడా ఆయన్ని గవర్నర్‌గా కొనసాగించాలని కోరుతున్న నేపథ్యంలో రాజన్‌ను రెండవసారి కొనసాగించడం ఖాయంగా కనిపిస్తోంది.