ఇంతకీ కేంద్ర బడ్జెట్ ఎన్ని లక్షల కోట్లో తెలుసా? కేంద్రం కూడా అప్పులు చేస్తుందా?
posted on Feb 2, 2020 9:46AM

తెలంగాణ బడ్జెట్ లక్షా 20కోట్లనో... ఏపీ బడ్జెట్ లక్షన్నర కోట్లనో... వినుంటాం.... మరి, ఇంతకీ కేంద్ర బడ్జెట్ ఎన్ని లక్షల కోట్లు..? ఏమో మాకేం తెలుసు అంటారా? అయినా, ఏ న్యూస్ ఛానెలూ చెప్పలేదు... ఏ వెబ్ సైట్లోనూ రాలేదు... అలాంటప్పుడు మాకెలా తెలుస్తుందంటారా? నిజమే, ఆ రంగానికి ఇన్ని కోట్లు..... ఈ రంగానికి అన్ని కోట్లు అంటూ మీడియా ఛానెల్స్ ఊదరగొట్టడమే గానీ... అసలింతకీ కేంద్ర బడ్జెట్ ఎన్ని లక్షల కోట్లు... ఆదాయ వ్యయాలెంత? కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వానికి వచ్చే ఆదాయమెంత? ప్రతి ఏడాది తీసుకొచ్చే అప్పు ఎంతో? అసలు కేంద్రానికి ఏవిధంగా ఆదాయం వస్తుంది. వస్తున్న ఆదాయం... ఆయా పథకాలకు, వివిధ వర్గాల సంక్షేమానికి సరిపోతుందా? లేక కేంద్రం అప్పు చేస్తుందా? ఇలాంటి విషయాలు తెలియాలంటే మీరు ఇది స్టోరీ చదివి తీరాల్సిందే.
ఐదారేళ్లుగా కేంద్ర బడ్జెట్ దాదాపు పాతిక లక్షల కోట్లకు అటూఇటుగా ఉంటూ వస్తోంది. అయితే, 2020-21 ఆర్ధిక సంవత్సరానికి మాత్రం 22 లక్షల 46వేల కోట్ల రూపాయల అంచనాలతో కేంద్ర బడ్జెట్‌ను ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. అయితే, కేంద్రం నిర్దేశించుకున్న వ్యయాలు మాత్రం 30లక్షల 42వేల కోట్లుగా ప్రకటించారు. అయితే, ఆదాయానికి వ్యయానికి భారీ తేడా ఉండటంతో ద్రవ్యలోటును 3.5శాతంగా కుదించి అంచనా వేశారు. అంటే, ఖర్చు చేయాల్సిన వ్యయానికి కంటే... ఆదాయం తక్కువగా ఉండటాన్నే ద్రవ్యలోటు అంటారు. ఇక, ఈ ఆర్ధిక సంవత్సరంలో జీడీపీ లక్ష్యాన్ని 10శాతంగా నిర్ణయించుకున్నట్లు తెలిపిన కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్... ఆదాయ వ్యయాల లెక్కలు కూడా చెప్పారు.
కేంద్రానికి వచ్చే ఆదాయంలో అధిక శాతం జీఎస్టీ వసూళ్లు.... కార్పొరేట్ పన్ను ద్వారానే సమకూరుతోంది. జీఎస్టీ నుంచి 18శాతం ఆదాయం... కార్పొరేట్ పన్ను నుంచి కూడా 18శాతం ఇన్ కమ్ కేంద్రానికి వస్తోంది. ఆ తర్వాత ఆదాయపు పన్ను ద్వారా 17శాతం ఆదాయం కేంద్రానికి లభిస్తోంది. అలాగే, పన్నేతర ఆదాయం 10శాతం కాగా... రుణేతర మూలధన వసూళ్లు 6శాతం... ఎక్సైజ్ పన్ను 7శాతం... కస్టమ్స్ ఆదాయం 4శాతంగా ఉన్నాయి. అయితే, 80శాతం ఆదాయం వివిధ పన్నుల రూపంలో కేంద్రానికి సమకూరుతుండగా... మిగిలిన 20శాతం నిధుల కోసం మాత్రం రుణాలపైనే కేంద్రం ఆధారపడుతోంది.
ఇక కేంద్రానికి వచ్చే ఆదాయంలో 20శాతం... రాష్ట్రాల పన్నుల వాటా కింద వెళ్లిపోతుంది. బడ్జెట్‌లో ఆమేరకు కేటాయింపులు చేస్తోంది. ఆ తర్వాత అత్యధికంగా రుణాలపై వడ్డీ చెల్లింపులకు 18శాతం ఆదాయాన్ని కేంద్రం వెచ్చిస్తోంది. ఇక, సబ్బిడీలకు 6శాతం... కేంద్ర ప్రాయోజిత పథకాలకు 9శాతం... ఇతర ఖర్చులు 10శాతం... ఆర్ధిక సంఘానికి 10శాతం... ఫించన్లకు 6శాతం... కేంద్ర పథకాలకు 9శాతం కేటాయిస్తుండగా... ఒక్క రక్షణ రంగానికే 8శాతం నిధులను కేంద్రం ఖర్చు పెడుతోంది. ఈవిధంగా కేంద్ర ఆదాయ వ్యయాలు ఉన్నాయి.