తెలంగాణ మంత్రులకు ఐటీ నోటీసులు... సుప్రీం ద్వారా షాకిచ్చిన రేవంత్ రెడ్డి...
posted on Feb 2, 2020 9:36AM

టీఆర్‌ఎస్‌లో ఐటీ నోటీసులు కలకలం రేపుతున్నాయి. 2017లో గులాబీ కూలీ పేరుతో భారీ వసూళ్లు చేశారన్న ఫిర్యాదుపై అప్పటి మంత్రులకు ఐటీశాఖ నోటీసులు ఇచ్చింది. గులాబీ పేరుతో సేకరించిన డబ్బుకు లెక్కలు సమర్పించాలంటూ ఆదేశించింది. గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన 17మందికి ఐటీ నోటీసులు రావడంతో టీఆర్‌ఎస్‌లో తీవ్ర దుమారం రేపుతోంది.
2017 టీఆర్‌ఎస్ ప్లీనరీకి నిధుల సమీకరణ కోసం అప్పటి మంత్రులు, టీఆర్ఎస్ నేతలు కూలి పనులు చేశారు. కొన్ని నిమిషాలపాటు చేసిన చిన్నచిన్న పనులకు కూలీగా లక్షలాది రూపాయలు ఆర్జించారు. ఆనాడు ఐస్‌క్రీమ్ అమ్మిన కేటీఆర్ 7లక్షల రూపాయలు సంపాదించగా.... పోచారం శ్రీనివాస్ రెడ్డి జిన్నింగ్ మిల్లులో కష్టపడి 8లక్షలు.... రైస్ మిల్లులో పనిచేసిన హరీష్‌రావు 6లక్షలు.... బట్టల షాపులో బట్టలమ్మిన నాయిని నర్సింహారెడ్డి 20లక్షలు... చేపలమ్మిన పద్మారావు 39లక్షలు సంపాదించగా.... రైస్‌మిల్లులో బియ్యం బస్తాలు మోసిన ఈటల రాజేందర్ 11లక్షలకు పైగా కూలీ అందుకున్నారు. అలాగే, పట్నం మహేందర్ రెడ్డి తాండూరు నర్సరీలో పనిచేసి 10లక్షలు సంపాదించగా.... ఆస్పత్రిలో వైద్య సేవలు అందించిన లక్ష్మారెడ్డి 5లక్షలు ఆర్జించారు. అలాగే, స్వీట్ షాపులో మిఠాయిలమ్మిన తలసాని శ్రీనివాసయాదవ్ 18లక్షలు సంపాదించారు. అయితే, ఆనాటి మంత్రులు టీఆర్ఎస్ ముఖ్యనేతలు.... పట్టుమని పది నిమిషాలు కూడా పనిచేయకుండానే లక్షలాది రూపాయలు సంపాదించడాన్ని ప్రశ్నిస్తూ కాంగ్రెస్ లీడర్ రేవంత్‌రెడ్డి సుప్రీంను ఆశ్రయించారు. రేవంత్ పిటిషన్‌పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఎన్నికల కమిషన్‌ను వివరణ కోరింది. అయితే, ఎన్నికల సంఘం ....ఐటీని వివరణ కోరడం.... ఇన్‌కం ట్యాక్స్ రంగంలోకి దిగింది. గులాబీ కూలీ పేరుతో లక్షల రూపాయులు సంపాదించిన ఆనాటి మంత్రులు, టీఆర్ఎస్ నేతలు నోటీసులు జారీ చేసింది. గులాబీ కూలీ పేరుతో ఎంత సంపాదించారు? మీకు ఆ డబ్బు ఇచ్చిందెవరు? కట్టిన పన్ను వివరాలు సమర్పించాలని ఐటీశాఖ కోరింది.
ఐటీ నోటీసులందుకున్నవాళ్లంతా టీఆర్ఎస్ అధిష్టానానికి రిపోర్ట్ చేయడంతో ఏం చేయాలనేదానిపై పార్టీ సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, వ్యక్తిగతంగా కాకుండా... పార్టీ తరపున... ఎన్నికల కమిషన్‌కు... అలాగే, ఐటీశాఖకు వివరణ ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే, పార్టీ విరాళాలకు ఐటీ వర్తించదని... ఇప్పటికే, పార్టీ జమా లెక్కలను ఎన్నికల కమిషన్‌ను సమర్పించామని... అందులో గులాబీ కూలీ వివరాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. అంతేకాదు నోటీసులందుకున్నవాళ్లెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పార్టీ అధిష్టానం భరోసా కల్పిస్తోంది. అయితే, పార్టీ తరపున పంపే వివరణతో ఐటీశాఖ సంతృప్తి చెందుతుందా? లేక తిరకాసు పెడుతుందో చూడాలి.