వల్లభనేనిపై మరో రెండు కేసులు.. కస్టడీలో విచారణకు సహకరించని వైసీపీ నేత
posted on Feb 26, 2025 10:18AM
.webp)
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఏపీ సిట్ పోలీసులు షాక్ ఇచ్చారు. ఆయనపై మరో రెండు కేసులు నమోదు చేశారు. మల్లవల్లి పారిశ్రామికవాడలో రైతులకు ప్రభుత్వం అందించిన పరిహారం అందించకుండా 128 మంది రైతులను మోసం చేశారని కేసు నమోదు చేశారు. అలాగే తేలప్రోలులో వివాదంలో ఉన్న శ్రీధర్ రెడ్డి పొలం రిజిస్ట్రేషన్ చేయిస్తామని చెప్పి, ఆ భూమిని కబ్జా చేసినందుకు వంశీ, ఆయన అనుచరులుపై మరో కేసు నమోదు అయింది. సిట్ ఏర్పాటు తరువాత ఒక్క రోజే గన్నవరం నియోజకవర్గంలో వంశీ ఆయన అనుచరులుపై మొత్తం మూడు కేసులు నమోదు నమోదయ్యాయి. వంశీపై నమోదైన కేసులన్నిటినీ సిట్‌కు ఇవ్వాలని పోలీస్ ఉన్నతాధికారులు నిర్ణయించారు.
ఇలా ఉండగా పోలీసుల విచారణలోవల్లభనేని వంశీ పోలీసులకు సహకరించడం లేదట. ఏది అడిగినా.. తెలీదు, గుర్తులేదు, మరచిపోయా.. అంటూ తాను నిర్మించిన అదుర్స్ సినిమాలోని డైలాగులే చెప్తున్నారట. గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న ముదునూరి సత్యవర్దన్‌ను బెదిరించి, కిడ్నాప్ చేసిన కేసులో ప్రధాన నిందితుడు వల్లభనేని వంశీమోహన్, ఏడో నిందితుడు వెలినేని వెంకట శివరామకృష్ణ ప్రసాద్, ఎనిమిదో నిందితుడు నిమ్మ లక్ష్మీపతిని విజయవాడ జిల్లా జైలు నుంచి పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. అక్కడి నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించారు.
ముగ్గురు నిందితులను విచారించడానికి ముగ్గురు ఏసీపీలు రంగంలోకి దిగారు. వల్లభనేని వంశీని సెంట్రల్ జోన్ ఏసీపీ దామోదర్ విచారించారు. శివరామకృష్ణప్రసాద్‌ను ట్రాఫిక్ ఏసీపీ వంశీధర్‌గౌడ్, లక్ష్మీపతిని సీసీఎస్ ఏసీపీ వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. ఒక్కొక్క అధికారి ఒక్కొక్క నిందితుడికి సుమారు 30 ప్రశ్నలు సంధించారు. రెండు గంటల పాటు వారిని విచారించారు. విచారణాధికారి అడిగిన ప్రశ్నలకు కొన్నింటికి మాత్రమే వంశీ సమాధానాలు చెప్పారంట. చాలా వాటికి అబద్ధాలు చెప్పారని విచారణాధికారులు భావిస్తున్నా రు. అసలు సత్యవర్దన్ ఎవరో తనకు తెలియదని ముందుగా సమాధానమిచ్చినట్లు తెలిసింది.