కాంగ్రెస్ ఓటమికి టీడీపీని నిందించొద్దు--టీఆర్ఎస్ నేత

 

తెలంగాణలో ఎన్నికల ఫలితాలు వచ్చేవరకు కూటమి నేతలు గెలుపు తమదే అని ధీమా వ్యక్తం చేశారు. కానీ ఎన్నికల ఫలితాలు వారి ఊహలను తారు మారు చేశాయి. ప్రజలు టీఆర్ఎస్ కి పట్టం కట్టారు. అయితే ఎన్నికల్లో ఓటమికి కారణాలు వెతుక్కునే పనిలో పడింది కాంగ్రెస్ పార్టీ. చివరికి తమ ఓటమికి కారణం టీడీపీతో పొత్తే అని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎంపీ వినోద్ స్పందించారు. తెలంగాణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ని గెలిపించాలని ప్రజలు ఏనాడో నిర్ణయించుకున్నారని, దానికీ టీడీపీతో కాంగ్రెస్‌ పొత్తుకూ సంబంధం లేదని వినోద్‌ అన్నారు. టీడీపీతో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకున్నా, పెట్టుకోకపోయినా టీఆర్‌ఎస్‌ ఘనవిజయం సాధించేదని వినోద్‌ చెప్పారు. కాంగ్రెస్‌ ఓటమికి టీడీపీని అనవసరంగా నిందించడం కానీ, టీఆర్‌ఎస్‌ విజయానికి టీడీపీకి ఘనత ఇవ్వడాన్ని తాము ఒప్పుకోబోమని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు కాంగ్రెస్ పార్టీ నేత,మాజీ ఎంపీ కిశోర్‌ చంద్రదేవ్‌ కూడా ఇదే విషయాన్ని వెల్లడించి అందరిని ఆశ్ఛర్యపరిచారు. తెలంగాణలో కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపిక సరిగా జరగలేదని, వారికి ప్రజాబలం లేదని ఆయన అన్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకున్నందువల్ల కాంగ్రెస్‌కు కనీసం 19 సీట్లు వచ్చాయనీ, లేకపోతే అవి కూడా దక్కేవి కావని ఆయన అభిప్రాయపడ్డారు. టీడీపీ ఓట్లు కాంగ్రెస్‌కు బదిలీ అయ్యాయని, కానీ కాంగ్రెస్‌ ఓట్లే కాంగ్రెస్‌కు పడలేదని కిశోర్‌ చంద్రదేవ్‌ వ్యాఖ్యానించారు.