గ్రేటర్ పై పట్టు కోసం తెరాస ప్రయత్నాలు

 

గ్రేటర్ హైదరాబాదులో ఆంధ్ర మరియు ఇతర రాష్ట్రాల నుండి వచ్చి స్థిరపడిన వారే అధికంగా ఉండటంతో, ఇంతవరకు అక్కడ జరిగిన ఎన్నికలలో పోటీ చేయడానికి వెనుకంజ వేస్తూవచ్చి తెరాస, లగడపాటి, రాయపాటి, కావూరి వంటి ఆంధ్ర నేతల సవాళ్ళను స్వీకరిస్తున్నట్లు ఇప్పుడు అక్కడా తన పట్టు బిగించేందుకు సిద్దం అవుతోంది. తెలంగాణకు గుండె కాయ వంటిదని చెప్పుకొనే ఆ ప్రాంతం పైన తమకు సరయిన పట్టు లేకపోవడం వలననే ప్రతిసారి తమ ఉద్యమం విఫలమవుతున్న సంగతి తెరాస కు అర్ధం అవడం కూడా ఈ నిర్ణయానికి మరో కారణమని చెప్పవచ్చును. ఈ ప్రయత్నంలోనే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవడానికి తెరాస చాలా గట్టి ఏర్పాట్లు చేసుకొని ముందు కదులుతోంది.

 

వచ్చే నెల2 నుండి 9 వరకు, 12 నుండి 16 వరకు రెండు విడతలుగా నగరంలో ‘గడప గడపకు తెలంగాణ’ కార్యక్షికమాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకొన్నట్లు టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు నాయిని నర్సింహాడ్డి తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని 150 డివిజన్లకు ఇన్‌చార్జీలను నియమించినట్లు ఆయన తెలిపారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు మొత్తం 23 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌చార్జీలుగా బాధ్యతలను అప్పగించినట్లు చెప్పారు. ఒక్కో డివిజన్‌కు 20మందితో కూడిన బృందం ఏర్పాటుచేయడం జరిగింది. ఇవి కాక తెరాస అనుబంధ విభాగాల కమిటీలను కూడా ఏర్పాటు చేసుకొంతోంది. ఈ కమిటీలు ఆయా డివిజన్‌ల పరిధిలో నివాసముండే ఉద్యోగులు, కార్మికులు, వ్యాపారవేత్తలు సహా ముఖ్యుల వివరాలన్నీ సేకరించడం ద్వారా, తగిన ప్రణాళికలు సిద్దం చేసుకోవచ్చునని తెరాస భావిస్తోంది.

 

ఇంత పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగుతున్న తెరాసను సరయిన నాయకత్వం లేని వైకాపా, అంతర్గత తగాదాలతో సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీ, తెదేపాలు, ఏవిధంగా ఎదుర్కొంటాయో చూడాలి.