తృణమూల్‌ విజయాలను దెబ్బతీసే ఆయుధం

 

మమతా బెనర్జీ.... అన్యాయం జరిగినచోట ఆవేశంగా ప్రసంగిస్తారు. అవినీతి గురించి నిప్పులు చెరుగుతారు. అందుకే ఆమె వ్యక్తిత్వం అంటే బెంగాలీయులకు మహా అభిమానం. మమతా దీదీ వేసుకునే చవకబారు చెప్పుల గురించీ, ఆమె ధరించే సాదా చీర గురించీ కథలు కథలుగా చెప్పుకుంటారు. ఆ అభిమానంతోనే దశాబ్దాల తరబడి తిరుగులేకుండా పోయిన సీపీఐ(ఎం)ని సైతం తోసిరాజని, మమతాను ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టారు. అవినీతి మీద మమత సాటిలేని పోరు సలుపుతుందని ఆశలు పెట్టుకున్నారు. కానీ, అవినీతికి కొమ్ముకాయడంలో తమ పార్టీ ఇతరులకంటే భిన్నమేమీ కాదని మమత నిరూపిస్తూనే ఉన్నారు.

 

పశ్చిమబెంగాల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన రెండేళ్లకే శారదాస్కాం అనే ఆర్థిక కుంభకోణం బయటపడింది. మమత మంత్రివర్గంలో క్రీడా, రవాణా శాఖ మంత్రిగా పనిచేస్తున్న ‘మదన్‌మిత్రా’ అనే మంత్రికి ఈ కుంభకోణంలో ముఖ్యపాత్ర ఉందంటూ ఆరోపణలు వచ్చాయి. అయినా మమతాదీదీ, మదన్‌మిత్రాను వెనుకేసుకుంటూనే వచ్చారు. మదన్‌మిత్రా అరెస్టైన తరువాత కూడా ఏడాదిపాటు మంత్రిగా కొనసాగారంటే, ఈ విషయంలో మమత ఎంత ఉదాసీనంగా వ్యవహరించారో తెలుస్తూనే ఉంది. పైగా మదన్‌మిత్రా ఇంకా జైళ్లో ఉండగానే, ఈసారి ఎన్నికలలో ఆయన పోటీ చేయనున్నట్లు మమత ప్రకటించారు! ఏదో ఒకరిద్దరి విషయంలో మమతాదీదీ తన మమతానురాగాలను ప్రకటించారులే అని జనం ఊరుకున్నారు. కానీ ఇంతలో నారద అనే ఒక న్యూస్‌ వెబ్‌సైట్‌ మరో బాంబు పేల్చడంతో మమత తన నిష్కళంకతని రుజువు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ మమత ప్రతిస్పందన వేరేలా ఉంది!
    

మాథ్యూ శామ్యూల్‌, తెహల్కా అనే పరిశోధనాత్మక పత్రిక నుంచి విడివడి, నారద అనే వేరుకుంపటి పెట్టుకున్న పాత్రికేయుడు. ఆయన రెండేళ్లపాటు ఓపికగా తృణమూల్‌ ముఖ్య నేతలందరినీ తన స్టింగ్‌ ఆపరేషన్‌ ఉచ్చులోకి లాగాడు. చెన్నైలో తమకు ‘ఇంపెక్స్‌ కన్సల్టెన్సీ’ అనే సంస్థ ఉందనీ, ఆ సంస్థ పశ్చిమబెంగాల్లో అవకాశాలు చక్కించుకునేందుకు కాస్త ‘సాయం’ చేయాలంటూ ఒక్కో ప్రభుత్వ నేతనీ కదిపాడు. శామ్యూల్ ప్రయత్నం వృథా పోలేదు.. ఒకరు కాదు, ఇద్దరు కాదు తృణమూల్‌ నేతలు ఏకంగా 11 మంది ఈ స్టింగ్‌ ఆపరేషన్లో చిక్కారు. లక్షలకు లక్షల సొమ్ము ఉచితంగా వస్తుంటే ఒక్క నేతాజీ కూడా వద్దనలేదు. అసలా సంస్థ ఉందా లేదా, ఉంటే దాని పనితీరు ఏంటి అని ఆలోచించేంత సమయాన్ని కూడా తమ మెదళ్లకు ఇవ్వలేదు.

 

ఈ స్టింగ్‌ ఆపరేషన్లో చిక్కినవారు సామాన్యలు కారు. కోల్‌కతా మేయర్ (సోవన్‌ ఛటర్జీ), ఎంపీ ప్రసూన్‌ బెనర్జీ సహా పలువులు ఎమ్మెల్యేలు, మాజీ కేంద్ర మంత్రులు కట్టల కట్టలుగా నోట్ల కట్టలను తీసుకుంటూ కెమెరాల ముందు దొరికిపోయారు. ఇలా తన స్టింగ్‌ ఆపరేషన్‌ను ముందుకు సాగించేందుకు, నారద వార్తా సంస్థ కనీసం 65 లక్షలు ఖర్చుచేసినట్లు సమాచారం. ఈ సంస్థ ఇంత ఖర్చు చేసి తృణమూల్ నేతలనే లక్ష్యంగా పెట్టుకుని ఎందుకు పనిచేసిందన్నది ఓ సహేతుకమైన ప్రశ్నే! అందులోనూ తన స్టింగ్ ఆపరేషన్‌ వివరాలను సరిగ్గా ఎన్నికల సమయంలో విడుదల చేయడం కూడా సందేహాలకు తావిస్తోంది. మరో నెల రోజులు కూడా లేని పశ్చిమ బెంగాల్‌ ఎన్నికలలో ఈ వీడియో ఎలాంటి ప్రభావం చూపుతుందో కాలేజీ కుర్రవాడు కూడా ఊహించగలడు. కానీ వీడియో బయటకు రాగానే తృణమూల్ స్పందించిన తీరు అంతే అనుమానాస్పదంగా ఉంది.

 

స్టింగ్‌ ఆపరేషన్‌లో పట్టుబడిన నేతల మీద తాము ఎలాంటి చర్యలూ తీసుకోబోమని ఆ పార్టీ అధినేతలు తేల్చిపారేశారు. కనీసం వారి నుంచి వివరణను కూడా తాము ఆశించడం లేదని సెలవిచ్చారు. ఇదంతా ప్రతిపక్షాల కుట్ర అంటూ మమతా బెనర్జీ ప్రకటించారు. ‘లంచం తీసుకుంటూ పట్టుబడిన వారి మీద విచారణ జరుపుతామని’ ఒక్క మాట అన్నా మమతాదీదీ మీద ప్రజలకు ఉన్న ఆశలు సజీవంగా ఉండేవేమో! కానీ వరుస విజయాలతో పాటు ఒంటెద్దుపోకడను కూడా అలవాటు చేసుకున్న దీదీ అందుకు సిద్ధంగా లేరు. ఫలితం! తృణమూల్‌ విషయంలో చూసీ చూడనట్లు ఉండే బీజేపీ వంటి పార్టీలు కూడా ఇప్పడు ఆ పార్టీ వ్యక్తిత్వం గురించి విరుచుకుపడుతున్నాయి. తృణమూల్‌కు బద్ధ శత్రువు అయిన వామపక్షాలకు, ఈ అంశం ఒక పాశుపతాస్త్రంగా పరిణమించింది. ఇక అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా అవినీతిలో మార్పు ఉండదన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్లిపోయాయి.

 

తృణమూల్ అర్భాటంగా పోటీ చేస్తున్న కేరళ మీద ఈ ఫలితం ఎలాగూ ఉంటుంది. కానీ ఆ పార్టీకి పెట్టని కోటగా మారిన పశ్చిమబెంగాల్లో ఈ మచ్చ పెనుమార్పునే తీసుకురావచ్చు. ఇప్పటికే పలు ప్రజాభిప్రాయ సేకరణలో ఈసారి ఎన్నికలలో ఇటు తృణమూల్‌, అటు వామపక్షాలకి సరిసమానమైన అవకాశాలు ఉన్నాయని తేల్చాయి. మరి ఆఖరి నిమిషంలోనైనా మమత మేల్కొని నష్టనివారణ చర్యలు చేపడతారా. లేకపోతే అవినీతి నేతలను వెనుకేసుకుని వారితో పాటు పరాజయాన్ని కూడా మూటగట్టుకుంటారా... అన్నది రాబోయే రోజుల్లో తేలిపోనుంది.