బడ్జెట్‌తో నవ తెలంగాణ

నీరు, నిధులు, నియామకాలు అంటూ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన తెలంగాణ, ఇప్పుడు తనకంటూ ఓ ప్రభుత్వాన్ని సాధించగలిగింది. తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన తెరాస, ఇప్పటికీ తిరుగులేకుండా రాష్ట్రాన్ని ఏలుతోంది. ఆ ఏలికల మీద ప్రజలకు ఉండే నమ్మకాన్ని చూరగొనేలా మరోసారి మిగులు బడ్జెట్‌ను రూపొందించింది తెరాస సర్కారు. ఇది పురోగామి బడ్జెట్‌ అంటూ మిత్రపక్షాలు అభినందించినా, ఉత్త అంకెలగారడీ అంటూ ప్రతిపక్షాలు విమర్శించినా... సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ, కేసీఆర్‌ ముద్రను జోడిస్తూ ఆర్థికమంత్రి తన బడ్జెట్‌ను సమర్పించారు.

బడ్జెట్‌ను చూసిన వారికి ఎవరికైనా ఇందులో సాగునీటి ప్రాజెక్టులకి వేలకి వేల కోట్లు కేటాయించిన అంకెలు కనిపించక మానవు. సాగు కోసం ఏకంగా 26 వేల కోట్ల రూపాయలను కేటాయించింది ప్రభుత్వం. గత ఏడాదితో (8,500 కోట్లు) పోలిస్తే ఇది అసాధారణం. ఈ కేటాయింపులలో ఎలాంటి అవకతవకలూ కనుక జరగకపోతే, ప్రభుత్వం ఆశించినట్లుగా లక్షల ఎకరాలు బీడు పోయే దుస్థితి నుంచి తప్పించుకుంటాయి. కాళేశ్వరం ప్రాజెక్టు, దేవాదుల, సీతారామ ఎత్తిపోతల పథకాలకు వందల కోట్ల రూపాయలను కేటాయించారు. తెలంగాణ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఏకంగా ఏడు వేల కోట్ల రూపాయల నిధులను కేటాయించారు. ఇప్పటికే టెండర్ల దశకు చేరుకున్న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కనుక పూర్తయితే ఈ రెండు జిల్లాలోనే దాదాపు 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నట్లు అంచనా!

వర్గాలవారీగా నిధులను కేటాయించడంలో తెలంగాణ బడ్జెట్, ఆంధ్రాను అనుసరించినట్లే కనిపిస్తోంది. మైనారిటీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ... ఇలా ఒకో వర్గానికీ వేల కోట్లను కేటాయించారు. అదనంగా ఈసారి బ్రాహ్మణులకు 100 కోట్లు కేటాయించడంతో వారి అభిమానాన్ని చూరగొన్నట్లు అయింది. దీంతో బ్రాహ్మణులను, వారిలోని సెటిటర్లను కూడా కేసీఆర్‌ తృప్తిపరిచారు. వెనుకబడిన తరగతులలోని ఆడపిల్లల వివాహాలు గుదిబండలు కాకుండా ఉండేందుకు రూపొందించిన ‘కల్యాణ లక్ష్మి’ పథకం కూడా ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేట్లే కనిపిస్తోంది.

సాగునీటికే కాదు సాగునీటి విద్యుత్తుకి, రుణమాఫీకి కూడా బడ్జెట్‌లోకావల్సిన ప్రాధాన్యత లభించింది. వచ్చే ఖరీఫ్‌ నుంచి రైతులకు 9 గంటల పాటు నిరంతర విద్యుత్తుని అందచేస్తామనీ, విద్యుత్తు రాయితీలకు 4,470 కోట్లు కేటాయిస్తామనీ చెబుతున్న మాటలు నిజమైతే కాలిన మోటర్ల సాక్షిగా, బతుకు బుగ్గవుతున్న రైతుల నెత్తిన పాలు పోసినట్లే! అటు వ్యవసాయానికే కాదు, ఇటు వైద్యానికి కూడా ఈసారి భారీ కేటాయింపులే లభించాయి. ఎన్నడూ లేని విధంగా ఒక్క వైద్య రంగానికే దాదాపు 6 వేల కోట్ల రూపాయలు దక్కాయి. డయాలసిస్‌ కేంద్రాల కోసం, వైద్య పరికరాల కొనుగోలు కోసం, రోగ నిర్ధరణ యంత్రాల కోసం... ఇలా వైద్యానికి సంబంధించి ప్రతి అంశానికీ వందల కోట్లు లభించాయి. ‘సర్కారు దవాఖానకు నేను రాను’ అన్న మాటని మారుస్తాం అని ప్రభుత్వం ఇచ్చిన హామీని ఇలా నిలబెట్టుకుంది.

మహిళలకు, శిశుసంక్షేమానికీ, రహదార్ల అభివృద్ధికీ, గ్రామీణాభివృద్ధికీ.... ఇలా బడ్జెట్‌లో ప్రతి అంశానికీ తగిన కేటాయింపులు కనిపించాయి. కానీ ముఖ్యమంత్రి మానస పుత్రిక అయిన డబుల్‌బెడ్‌రూం పథకానికి మాత్రం ప్రత్యేకించిన కేటాయింపులు లేకపోవడం గమనార్హం. వీటి కోసం ఇతర నిధుల నుంచి కానీ, రుణాల ద్వారా కానీ సొమ్ములను ఖర్చుచేయాల్సిందే! ఇక ప్రభుత్వం దర్పంగా ఇది మిగులు బడ్జెట్‌ అని చెప్పుకోవడం మాత్రం ఉత్తమాటే అనిపిస్తోంది. రెవెన్యూ అంకెలను, రుణాలను ఎడాపెడా పెంచేసి అదే మిగులు అని చెప్పుకోవడం చూస్తే... అప్పు చేసి పప్పు కూడు అన్న సామెత గుర్తుకురాక మానదు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని అద్భుతంగా పాలిస్తున్నామన్న పేరు కోసం ఈ కాస్త గారడీని చేయకుండా ఉంటే బాగుండేది. మన రాష్ట్రాన్ని మనం పాలించుకోవడంలో భేషజాలు ఎందుకు!