ఎపిలో నలుగురు ఎస్ పీలపై వేటు? 

ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ లో చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనలపై ఈసీ సీరియస్ అయ్యింది. తిరుపతిలో టిడిపి నేత పులివర్తినానిపై దాడి, తాడిపత్రిలో హింసాత్మక సంఘటనలు, పల్నాడులో చెలరేగిన హింస ఎన్నికల కమిషన్కు  చెడ్డ పేరు తీసుకొచ్చింది. వైసీపీ అధికార యంత్రాంగమంతా ఎన్నికల కమిషన్ చేతిలో ఉంటుంది. ఈ కారణంగా ఎన్నికల కమిషన్ ఇబ్బందుల్లో పడింది. నష్ట నివారణ చర్యల్లో భాగంగా నలుగురు ఎస్ పిలను ఏరివేయడానికి సిద్దమైంది.   ఎపిలో పోలింగ్ పూర్తయింది.  కౌంటిగ్ కు  మాత్రం వచ్చే నెల నాలుగో తేదీన ఉండటంతో అప్పటి వరకు రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడే ఉద్దేశ్యంతో ఎన్నికల కమిషన్ ఉంది. ఈ నేపథ్యంలో ఏపీలో మరో నలుగురు ఎస్పీలపై ఎన్నికల సంఘం కత్తి వేలాడుతోంది. ఎన్నికల విధుల్లో వైఫల్యం.. హింసను కట్టడి చేయలేక పోవడంపై చర్యలు తీసుకోబోతోంది. బుధవారం రాత్రి పోలీసు ఉన్నత స్థాయి అధికారులకు అందిన సమాచారం మేరకు గురువారం రాయలసీమలో ముగ్గురు, పల్నాడులో ఒకరిపై వేటుపడే అవకాశం ఉంది. పోలింగ్‌ సందర్భంగా జరిగిన హింసపై సీరియస్‌ అయిన కేంద్ర ఎన్నికల కమిషన్‌... ఆ తర్వాతా కొనసాగడాన్ని క్షమించలేక పోతోంది. ఎప్పుడూ గొడవలు జరిగే పల్నాడు జిల్లాలో విధ్వంసాన్ని ఉపేక్షించే ప్రసక్తేలేదని ఢిల్లీ ఈసీ వర్గాలు రాష్ట్ర పోలీసు పెద్దలకు హెచ్చరిక చేసినట్లు తెలుస్తోంది.