చెంపదెబ్బ ఘటనపై శివకుమార్ కొత్త స్క్రీన్ ప్లే!
posted on May 16, 2024 2:15PM
తెనాలి ప్రస్తుత ఎమ్మెల్యే, ఘోర పరాజయం పాలవబోతున్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ కేవలం ఫైట్ మాస్టరే అని ఇప్పటి వరకూ అనుకుంటూ వచ్చాం కదా.. ఆయన కేవలం ఫైట్ మాస్టర్ మాత్రమే కాదు.. కథ, స్క్రీన్ ప్లే, మాటల రచయితగా కూడా మంచి టాలెండెడ్ అని ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతోంది.
గొట్టిముక్కల సుధాకర్ అనే తెనాలి ఓటర్ కొట్టిన గాఠ్ఠి చెంపదెబ్బ నుంచి కాస్త కోలుకున్న అన్నాబత్తుని శివకుమార్ ఇప్పుడు కొత్త స్క్రీన్ ప్లేతో జనం ముందుకు వచ్చారు. వాస్తవానికి పోలింగ్ రోజు జరిగిందేమిటంటే, తెనాలి ఐతానగర్లో వున్న పోలింగ్ స్టేషన్‌కి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తన భార్యతో కలసి ఓటు వేయడానికి వచ్చారు. డైరెక్ట్.గా పోలింగ్ బూత్ దగ్గరకి వెళ్ళబోయారు.
అప్పటికే క్యూలో నిరీక్షిస్తున్న గొట్టిముక్కల సుధాకర్ మీరెలా డైరెక్ట్.గా బూత్ దగ్గరకి వెళ్తారు. మీరు కూడా క్యూలో రావాలి అన్నారు. అంతే, శివకుమార్ శివాలెత్తిపోయారు. గొట్టిముక్కల సుధాకర్ దగరకి వెళ్ళి ఆయన చెంప మీద కొట్టారు. దాంతో గొట్టిముక్కల సుధాకర్ వెంటనే రియాక్ట్ అయ్యారు. శివకుమార్ కొట్టినదానికంటే డబుల్ కోటాలో రివర్స్ గిఫ్ట్.గా చెంప ఛెళ్ళుమనిపించారు. దాంతో శివకుమార్ అనుచరులు సుధాకర్ మీదపడి చావగొట్టారు. ఆ తర్వాత పోలీసులు సుధాకర్ మీద కేసు పెట్టారు. ఎన్నికల కమిషన్ జోక్యంతో శివకుమార్‌ని హౌస్ అరెస్టు చేశారు.
సుధాకర్‌ని శివకుమార్ చెంపదెబ్బ కొట్టిన సంగతేమోగానీ, శివకుమార్‌ని సుధాకర్ లాగిపెట్టి కొట్టడం హైలైట్ అయింది. ఓటర్ని కొట్టినందుకు శివకుమార్‌కి తిక్క కుదిరిందన్న అభిప్రాయం అంతటా వ్యాపించింది. పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఈ ఘటన జరిగింది. ఆ తర్వాత ఈ వార్త దావానలంలా వ్యాపించి, ఓటింగ్ మీద తీవ్ర ప్రభావం చూపించింది. అసలే ఓటమి బాటలో వున్న శివకుమార్ ఈ ఘటన పుణ్యమా అని ఓటమి కన్ఫమ్ చేసుకున్నారు.
ఓటర్ని కొట్టి, ఓటర్ చేత కొట్టించుకున్న ఘటనలో పరువు పూర్తిగా పోగొట్టుకున్న శివకుమార్ ఇప్పుడు సరికొత్త స్క్రీన్ ప్లేతో రిపేరింగ్ వర్క్ మొదలుపెట్టారు. ‘‘నేను, నా భార్య ఓటు వేయడానికి వెళ్ళాం. అక్కడ గొట్టిముక్కల సుధాకర్ అనే వ్యక్తి నన్ను దూషించడం మొదలుపెట్టాడు. ఎమ్మెల్యేగా మాల, మాదిగ సామాజిక వర్గాలకు కొమ్ముకాస్తున్నావంటూ నన్ను దుర్భాషలాడాడు. వైసీపీపై ద్వేషంతో రగిలిపోయాడు. నా భార్య ముందే నన్ను తిట్టాడు. నేను పోలింగ్ బూత్‌లోకి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు తిడుతూనే వున్నాడు. తాను కూడా నా సామాజిక వర్గం వాడే అయినప్పటికీ, నువ్వు మన సామాజిక వర్గం వాడినేనా అని తిట్టాడు. పోలింగ్ బూత్ దగ్గర మద్యం మత్తులో అతను చాలామందితో దురుసుగా ప్రవర్తించాడు. ఇదంతా అక్కడున్న ఓటర్లే చెప్పారు’’ అని కొత్త స్టోరీ అల్లి చెబుతున్నారు.
తన అహంకారంతో జరిగిన సంఘటన మధ్యలోకి శివకుమార్ కులాలని కూడా లాక్కొచ్చారు. తన భార్యని కూడా ఇన్వాల్వ్ చేశారు. మిస్టర్ శివకుమార్.. ఓటర్ని కొట్టి నువ్వు చేసింది పెద్ద తప్పు. ఇప్పుడు దాన్ని కవర్ చేసుకోవడం కోసం కొత్త స్క్రీన్ ప్లే క్రియేట్ చేయడం, కులాలని, మీ భార్యని ఈ ఇష్యూలోకి లాగడం ఇంకా పెద్ద తప్పు. అర్థమవుతోందా?