రోశయ్య ఇక లేరు.. జవాద్ గండం.. అఖండకు అఘోరాలు.. ఒమిక్రాన్ వర్రీ.. టాప్ న్యూస్@1PM
posted on Dec 4, 2021 11:49AM
మాజీ సీఎం కొణిజేటి రోశయ్య కన్నుమూశారు. లోబీపీతో అకస్మాత్తుగా రోశయ్య పడిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే తుదిశ్వాస విడిచారు. రోశయ్య 4 జులై 1933న గుంటూరు జిల్లా వేమూరులో జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో రోశయ్య విద్యాభ్యాసం కొనసాగించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
-----
మాజీ సీఎం రోశయ్య మృతి పట్ల ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ సంతాపం ప్రకటించి సానుభూతి వ్యక్తం చేశారు. ఈ మేరకు రోశయ్య కుమారుడు శివతో రాహుల్ ఫోన్‌లో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి రోశయ్యకు ఉన్న అనుబంధాన్ని కాంగ్రెస్ నేత గుర్తు చేసుకున్నారు. ఆపై కేవీపీ రామచందర్ రావ్‌తో రాహుల్ ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా రోశయ్య మృతి వివరాలను రాహుల్‌కు కేవీపీ వివరించారు.
-------
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మరణం పట్ల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా సంతాపం తెలిపారు. ఆర్ధిక శాఖ మంత్రిగా పలు పదవులకు వన్నె తెచ్చిన రోశయ్య, సౌమ్యుడిగా, సహన శీలిగా, రాజకీయాల్లో తనదైన శైలిని ప్రదర్శించేవారు అని గుర్తు చేసుకున్నారు.
------
మచ్చలేని రాజకీయ యోధుడు రోశయ్య అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొనియాడారు. ఆయన మరణం తెలుగు వారికి తీరని లోటన్నారు. నిష్కళంక రాజకీయ యోధుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎనలేని సేవలు అందించారన్నారు. తనకు రోశయ్యతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని.. ఆయన మరణం తనను వేదనకు గురి చేసిందన్నారు.
-----
హెచ్‌ఐసీసీ నోవాటెల్‌లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్, మీడియేషన్ సెంటర్ సదస్సులో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ప్రభుత్వం, ప్రజల తరఫున సీజేఐ జస్టిస్ రమణకు ధన్యవాదాలు తెలిపారు. మధ్యవర్తిత్వం దేశంలో రచ్చబండ వంటి రూపాల్లో ఎప్పటి నుంచో ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. వివిధ కారణాల వల్ల పరిశ్రమలు వివాదాలు ఎదుర్కొంటున్నాయన్నారు. ఆలస్యమైనా హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం రావటం సంతోషమన్నారు.
---
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న జవాద్ తుపాను మరింత బలపడి తీవ్ర తుపానుగా మారింది. ప్రస్తుతం ఇది విశాఖకు ఆగ్నేయంగా 250 కిలోమీటర్ల దూరంలో, పారదీప్‌కు 360 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణశాఖ(ఐఎండీ) తెలిపింది. గడచిన కొద్దీ గంటలుగా తుపాను వాయువ్య దిశలో గంటకు 6 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. క్రమంగా దిశ మార్చుకుని ఆదివారం మధ్యాహ్ననికి పూరీ తీరానికి చేరువగా వెళ్లే అవకాశం ఉందని ఐంఎండీ వెల్లడించింది.
-----
సీబీఐ పేరిట మోసాలకు పాల్పడుతున్న నలుగురు ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 23దీన ఖాజీపేట మండలం పత్తూరు గ్రామానికి చెందిన ఉదయ్ కుమార్‌ను విచారణ పేరిట నిందితులు కారులో తీసుకెళ్లారు. అక్కడక్కడా తిప్పుతూ అతని వద్ద నుండి 1.14 లక్షల రూపాయలను దండుకున్న దుండగులు మరుసటి రోజు వదిలిపెట్టారు. ఈ వ్యవహారంపై బాధితుడు ఉదయ్ కుమార్ చెన్నూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
----
నటుడు నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ’ సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. నర్సీపట్నంలో బాలయ్య అఖండ సినిమాకి అఘోరాలు తరలివచ్చారు. నర్సీపట్నం బంగార్రాజు ధియేటర్‌లో అఘోరాలు సందడి చేశారు. అఖండ సినిమాతో బాలయ్య అఘోరాలు కూడా ఫ్యాన్స్ అయ్యారంటూ అభిమానులు థియేటర్‌లో కేకలు వేశారు. కాసేపు బాలయ్య అభిమానులతో మాట్లాడి, శివ నామం పలుకుతూ అఘోరాలు బయటకి వెళ్లారు.
---
ఒమైక్రాన్ వేరియెంట్ టెన్షన్‌తో డిప్రెషన్‌కు గురైన ఓ డాక్టర్ తన భార్యాపిల్లలను చంపిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ నగరంలో వెలుగుచూసింది. కాన్పూర్ నగరంలోని కళ్యాణ్ పూర్ ప్రాంతానికి చెందిన ఓ డాక్టర్ కరోనా కొత్త వేరియెంట్ ఒమైక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో టెన్షన్‌తో డిప్రెషన్‌కు గురయ్యాడు. డాక్టర్ తన ఇంట్లో శుక్రవారం రాత్రి భార్య, ఇద్దరు పిల్లలను చంపి పారిపోయాడు. డిప్రెషన్‌లో తాను భార్య పిల్లలను హత్య చేశానని పరారీలో ఉన్న డాక్టర్.. సోదరుడికి వాట్సాప్‌లో సందేశమిచ్చాడు.
---
దేశంలోని సైనికాధికారులపై ఢిల్లీకి చెందిన ఓ మహిళా న్యాయవాది వలపు వల (హనీట్రాప్) విసిరిందని కేంద్ర ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) విభాగం ఢిల్లీకి చెందిన మహిళా న్యాయవాది నుంచి దూరంగా ఉండాలని భద్రతా అధికారులను హెచ్చరిస్తూ మెమోరాండం జారీ చేసింది.