జ‌గ‌న్@వేల కోట్ల బ్లాక్‌మ‌నీ.. తెలంగాణ‌లో ముంద‌స్తు.. వైసీపీ రేసులో ర‌ఘురామ‌.. టాప్ న్యూస్ @7pm

1. వైసీపీ పాలనలో ప్రజలకు అప్పులు.. జగన్ బినామీలకు ఆస్తులు పెరిగాయని టీడీపీ అధినేత చంద్ర‌బాబు మండిప‌డ్డారు. రాంకీ, హెటిరో సహా బినామీ కంపెనీల్లో వేల కోట్ల బ్లాక్‌మనీ ఉందని ఆరోపించారు. జగన్ పాలనలో నిర్వీర్యమవుతున్న సాగునీటి ప్రాజెక్టుల సందర్శనకు చంద్రబాబు పిలుపునిచ్చారు. పోలవరం, నదుల అనుసంధానాన్ని కమీషన్ల కోసం అస్తవ్యస్తం చేస్తున్నారని.. కమీషన్ల కోసం పోలవరం ప్రాజెక్టు లోపల మరో ఎత్తిపోతల పథకం అంటున్నారని విమర్శించారు. 

2. విద్యుత్ పరిస్థితులపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహంచారు. థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత రాకుండా చూసుకోవాలని సీఎం ఆదేశించారు. సింగరేణి సహా కోల్ ఇండియా తదితర సంస్థలతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని.. కావాల్సిన విద్యుత్‌ను సమీకరించుకోవాలని అధికారుల‌ను జగన్ ఆదేశించారు. 6300 మెగావాట్ల రివర్స్ పంపింగ్ విద్యుదుత్పత్తి ప్రాజెక్ట్ నిర్మాణంపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. 

3. మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు కేసీఆర్ స‌మ‌క్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. మోత్కుపల్లి అణగారిన వర్గాల గళం వినిపించారని కేసీఆర్ కొనియాడారు. బలహీన వర్గాలను బలోపేతం చేయడానికే దళిత బంధు పథకాన్ని తెచ్చామని తెలిపారు. దళిత బంధు.. దళితులతోనే ఆగిపోదని, బీసీ, ఇతర వర్గాలకు కూడా వర్తింపజేస్తామని కేసీఆర్ ప్రకటించారు.

4. హుజురాబాద్ ఎన్నిక తర్వాత కేసీఆర్‌ నాయకత్వంపై తిరుగుబాటు రాబోతోందని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తిరుగుబాటును ఎదుర్కొనేందుకే కేసీఆర్ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. 2022 ఆగస్టులో గుజరాత్ ఎన్నికలతో పాటు తెలంగాణ ఎన్నికలూ జరుగుతాయని జోస్యం చెప్పారు. సీఎం కేసీఆర్ ఖచ్చితంగా ముందస్తు ఎన్నికలకు వెళ్తారని రేవంత్‌రెడ్డి అన్నారు. ఎవరు అడగకుండానే ముందస్తు ఎన్నికల చర్చ ఎందుకు తీసుకొచ్చారో కేసీఆరే చెప్పాలని రేవంత్‌ డిమాండ్ చేశారు. 

5. వైసీపీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రకటించారు. పార్టీలో సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అధ్యక్ష పదవికి ఎవరైనా పోటీ చేయొచ్చన్నారు. క్రమశిక్షణ గల కార్యకర్తను కాబట్టే తనను పార్టీలోంచి తొలగించలేదని తెలిపారు. తనపై దాఖలైన అనర్హత పిటిషన్‌ను కొట్టివేయాలని.. స్పీకర్‌ ఓం బిర్లాకు లేఖ రాసిన‌ట్టు రఘురామకృష్ణరాజు తెలిపారు.  

6. "ఈ తరం యువతకు నవతరం న్యాయకత్వం".. అనే నినాదంతో వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల బుధవారం నుంచి ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభించనున్నారు. చేవెళ్లలో మొద‌లుపెట్టి.. 14 నెలలు, 4 వేల కిలోమీటర్లు, 90 నియోజక వర్గాల్లో.. రోజుకి 12 కిలోమీటర్లు చొప్పున‌ పాదయాత్ర చేయ‌నున్నారు. ప్రతి రోజు రచ్చబండ మాదిరిగా మాట-ముచ్చట కార్యక్రమం జరుగుతుంది. పాదయాత్రలో 9 భారీ బ‌హిరంగ సభలు నిర్వహిస్తారు షర్మిల.

7. సీఎం జ‌గ‌న్‌రెడ్డిపై తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘జగనన్న లాంటి నాయకుడు ఇన్ని అబద్దాలు చెప్పుకుంటూ.. ప్రజలను మోసపుచ్చుకుంటూ బతకడం మంచిది కాదని’ అన్నారు. మనిషిగా పుట్టాక అంతో.. ఇంతో సహాయం చేయాలని, అలాంటి గుణం లేనప్పుడు ఎవరి పరిధిలో వారుండాలన్నారు. రాజకీయ లబ్ధికోసం ఏం మాట్లాడతారో తెలియని పరిస్థితిలో జగన్ ఉన్నారని కేతిరెడ్డి ఘాటైన కామెంట్లు చేశారు. 

8. నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అక్రమాలపై సొంత పార్టీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతి చిన్న పనికి ఓ రేటు కట్టి.. పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారని చేజ‌ర్ల సుబ్బారెడ్డి ఆరోపించారు. అంగన్‌వాడి పోస్టులు, పార్టీ పదవులకు రేట్లు కట్టి అమ్మకాలు సాగిస్తున్నారని విమర్శించారు. జగనన్న ఆశయాలకు తూట్లు పొడుస్తూ అవినీతికి పాల్పడుతున్నారని విమ‌ర్శించారు.

9. పెనుగొండ వైసీపీలో పందికొక్కుల బ్యాచ్ ఎక్కువైందని మంత్రి శంకర్ నారాయణ ఫైర్ అయ్యారు. అడ్డదారుల్లో డబ్బులు సంపాదన కోసం ప్రయత్నిస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇక‌, మంత్రి వ్యాఖ్యలకు గోరంట్ల మండలానికి చెందిన వైసీపీ నేత రమణారెడ్డి కౌంటరిచ్చారు. ఎవరు పందికొక్కులో అందరికీ తెలుసునన్నారు. దేవుడిపై ప్రమాణం చేయడానికి ముందుకు రావాలని ఆయన సవాల్ విసిరారు.

10. దిక్కుమాలిన పార్టీకి ఓటు వేశామని, రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందంటూ ప్రజలు బాధ పడుతున్నారని టీడీపీ సీనియ‌ర్‌ నేత అయ్యన్న పాత్రుడు అన్నారు. చెత్త పాలన  చేసిన వారిని చెత్తనా కొడుకులు అనక.. ఏమంటారని మ‌రోసారి నిలదీశారు. ఆదాయం ఏంటి?.. దుబారా ఏంటి?.. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏంటి?.. చేస్తున్నది ఏమిటంటూ ప్రశ్నించారు. బ్రాందీ షాపులు 25ఏళ్లు తాకట్టు పెట్టారని, మళ్లీ మద్యపాన నిషేధం అంటారని మండిప‌డ్డారు.