టీఆర్ఎస్ లో తిరుగుబాటు మొదలైందా? ముందస్తు ఎన్నికలు ఖాయమేనా? 

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయని కొంత కాలంగా ప్రచారం సాగుతోంది. మొదటి టర్మ్ లో  10 నెలల ముందే తన ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు వెళ్లి సంచలనం చేశారు సీఎం కేసీఆర్. మొదటి టర్మ్ లో తరహాలోనే  ఈసారి కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారనే చర్చ నడుస్తోంది. మూడేండ్లుగా జనంలోకి రాని కేసీఆర్ సడెన్ గా రూటు మార్చి జిల్లాలు చుట్టేస్తుండటం, పార్టీ సంస్థాగత ఎన్నికలను సీరియస్ గా నిర్వహించడం, నవంబర్ లో వరంగల్ లో భారీ బహిరంగ సభ తలపెట్టడం.. ఇవన్ని రాజకీయ వర్గాల్లో సరికొత్త చర్చకు దారి తీస్తున్నాయి. కేసీఆర్ ఇటీవల తీసుకుంటున్న నిర్ణయాలు, ప్రకటిస్తున్న పథకాలు,  పార్టీలో జరుగుతున్న పరిణామాలతో ఏదో జరగబోతుందన్న అనుమానాలు కొన్ని వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.  

తాజాగా ముందస్తు ఎన్నికలు , టీఆర్ఎస్ వ్యవహారాలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నిక తర్వాత టీఆరెఎస్ లో చాలా మార్పులోస్తాయని, పార్టీ లో తిరుగుబాటు తప్పదని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలు ఉండవు అంటూ చేసిన ప్రకటనపై స్పందించిన రేవంత్ రెడ్డి.. టిఆర్ఎస్ లో తీవ్రస్థాయిలో ముసలం రాబోతుందన్నారు. వరంగల్ విజయ గర్జన సభ పెడ్తా అని కేసీఆర్ ప్రకటించడం రాబోయే తిరుగుబాటును ఎదుర్కోడానికేనని తెలిపారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలతో కేసీఆర్ భయంతోనే వున్నారని.. అది బయటపడకుండా ప్రవర్తిస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు.

ముందస్తు ఎన్నికలు రావని కేసీఆర్ చెప్పడం హాస్యాస్పదంగా వుందని రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల కలిసి రావని, 6 నెలల ముందే అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని  వివరించారు.  గుజరాత్ తోనే తెలంగాణలో ఎన్నికలు వస్తాయన్నారు. 2022 ఆగస్ట్ 15 తో స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతుందని, దీంతో కొత్త శకానికి నాంది అని కేసీఆర్ ఎన్నికలకు వెళ్తారని రేవంత్ రెడ్డి చెప్పారు.   మోడీ డైరెక్షన్ లో కేసీఆర్ గుజరాత్ ఎన్నికలతో కలిసి ముందస్తూ ఎన్నికలకు వెళ్తారని, రాష్ట్రంలో బిజేపిని బలోపేతం చేసే కుట్ర జరుగుతోందని రేవంత్ రెడ్డి వివరించారు. తెలంగాణలో ఎంపీలు 16 గెలుస్తం,  కేంద్రంలో చక్రం తిప్పుతామని కేసీఆర్ చెప్పడం దేనికి సంకేతమని రేవంత్ నిలదీశారు. 

ఇప్పుడే ముందస్తు ఎన్నికలు అంటే  అంటే తన పార్టీలో మరింత గందరగోళం వస్తదని కేసీఆర్ చెప్పడం లేదని రేవంత్ రెడ్డి అన్నారు.ప్రతి నియోజక వర్గంలో నాయకులకు టికెట్ల ఇచ్చే పరిస్తితి లేదు కాబట్టి.. వారు ముందస్తుగానే అలర్ట్ కాకుండా ఈ డ్రామా ఆడుతున్నాడని అన్నారు. ముందస్తు ఎన్నికల గురించి కేసీఆర్ ను ఎవరు అడిగారని, ఆయన  ఎందుకు మాట్లాడుతున్నారని రేవంత్ ప్రశ్నించారు. మరో రెండేళ్లు నా సర్కార్ అధికారంలో ఉంటుందని  చెప్పుకోవడం కోసమే ఈ ముందస్తు ఉండదని చెప్పడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. హరీష్ రావు ను కూడా కేసీఆర్ త్వరలో పార్టీ నుండి బయటికి పంపుతాడని, మిత్ర ద్రోహి పేరుతో.. స్మశాన వాటికకు పంపుతాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ లో ఈటెల గెలిచినా, ఓడినా ఎవరికి లాభం లేదని రేవంత్ రెడ్డి తెలిపారు.

టీఆర్ఎస్ లో తిరుగుబాటు తప్పదంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆదివారం తెలంగాణ భవన్ లో జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ను ఉద్దేశించి ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఘాటుగా మాట్లాడారనే వార్తలు వచ్చాయి. ఇది కూడా టీఆర్ఎస్ లో తిరుగుబాటు మొదలైందనే దానికి సంకేతం అంటున్నారు. పువ్వాడ అజయ్ లానే టీఆర్ఎస్ లో చాలా మంది నేతలు ఉన్నారంటున్నారు.