ఏపీకి టాలీవుడ్ తరలింపు సాధ్యమేనా?

తెలంగాణ నుంచి తెలుగు సినిమా పరిశ్రమ ఏపీకి తరలనుందన్న చర్చ మరో సారి మొదలైంది. రాష్ట్ర విభజనకు ముందే ఈ చర్చ పెద్ద ఎత్తున ప్రారంభమైంది. తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ హీరోలను టార్గెట్ చేసిన సంగతి ఇక్కడ ప్రస్తావనార్హం. దీంతో అప్పటి నుంచే రాష్ట్రం విడిపోతే తెలుగు సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ కు తరలిపోవడం ఖాయమన్న చర్చ అప్పట్లో పెద్ద ఎత్తున జరిగింది. రాష్ట్ర విభజన జరిగి బీఆర్ఎస్ ప్రత్యేక తెలంగాణలో అధికార పగ్గాలు చేపట్టిన కొత్తలో ఇండస్ట్రీ ఇక ఏపీకి తరలిపోవడం లాంఛనమే అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అయ్యింది కూడా.

అయితే అధికారంలోకి వచ్చిన తరువాత పరిస్థితిలో మార్పు వచ్చింది. అధికారంలోకి వచ్చే వరకూ తెలుగుహీరోలను, ఆంధ్రామూలాలున్న సీని వ్యక్తులను టార్గెట్ చేసి మరీ విమర్శలు గుప్పించిన బీఆర్ఎస్ ఆ తరువాత వైఖరి మార్చుకుంది. రాష్ట్ర ఆదాయంలో మద్యం తరువాతి స్థానం సినీ ఇండస్ట్రీదే కావడంతో బీఆర్ఎస్ సర్కార్ తెలుగు సినీ పరిశ్రమను చాలా జాగ్రత్తగా చూసుకుంది. ఉద్యమ సమయంలో తరిమి కొడతాం అంటూ హెచ్చరికలు జారీ చేసిన బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత సినీ పరిశ్రమను ఇతోధికంగా ప్రోత్సహించి, అక్కున చేర్చుకుంది. దీంతో టాలీవుడ్ పరిశ్రమ తెలంగాణలో హాయిగా కొనసాగింది.  అయినా ఇలా ఒక సమస్య వచ్చిందని పరిశ్రమను తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు తరలించేయడం అంత తేలికైన విషయం ఏమీ కాదు. హైదరాబాద్ లో దశాబ్దాల పాటు పాతుకుపోయిన టాలీవుడ్ పరిశ్రమ తనకు అవసరమైన మౌలిక వసుతలన్నీ ఇక్కడ అభివృద్ధి చేసుకుంది. పరిశ్రమ అంటే ఒక్క సినిమా  షూటింగ్ మాత్రమే కాదు. స్టూడియోలు, డబ్బింగ్ స్టూడియోలు, ఆర్టిస్టుల నివాసాలు ఇలా ఎన్నోఎన్నెన్నో ముడిపడి ఉన్నాయి. 

ఇప్పుడు ఒక్క హీరోకు కష్టం వచ్చిందని పరిశ్రమ తరలిపోబోతోందంటూ జరుగుతున్న ప్రచారాన్ని నమ్మడం కష్టం. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఏపీకి టాలివుడ్ తరలిపోబోతోందంటూ పెద్ద ఎత్తున ప్రచారం అవుతోంది.  పరిశ్రమ మనుగడకు అవసరమైన సకల మౌలిక సదుపాయాలూ హైదరాబాద్ లో అభివృద్ధి చెంది ఉన్నాయి. ఇప్పుడు ఏపీలో పరిశ్రమ విస్తరణకు అవకాశాలు ఉంటే ఉండొచ్చు.. వాటిని సద్వినియోగం చేసుకుంటూ పరిశ్రమ అక్కడా విస్తరించేందుకు ఆస్కారం ఉంది కానీ.. ఇక్కడ నుంచి తట్టాబుట్టా సర్దేసుకునే మొత్తం ఇండస్ట్రీ, హీరోలు, నిర్మాతలూ తట్టాబుట్టా సర్దేసుకుని ఆంధ్రప్రదేశ్ కు తరలిపోయే అవకాశాలు ఇసుమంతైనా లేవని గట్టిగా చెప్పవచ్చు.   ఏపీలో సినీ ఇండస్ట్రీ డెవలప్ కావాలంటే ఎన్నో మౌలిక సదుపాయాలు ఏర్పాటు కావాల్సి ఉంది.  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వద్ద మంత్రదండం ఏమీ లేదు. రాత్రికి రాత్రి టాలీవుడ్ కు అవసరమైన మౌలిక వసతులు కల్పించడానికి.  

అల్లు అర్జున్ ఎపిసోడ్ తో టాలీవుడ్ పరిశ్రమ ఇప్పుడు ఆపన్న హస్తం కోసం ఏపీ ప్రభుత్వం వైపు చూడటం సహజమే. అయితే ఆ ఆపన్నహస్తం అందించేందుకు ఏపీ సర్కార్ ముందుకు వస్తుందన్న నమ్మకం లేదు. పొరుగు రాష్ట్రంతో సత్సంబంధాలు ఉండాలనే ఏపీ సర్కార్ భావిస్తుంది.  కనుక ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ ఇద్దరూ కూడా తెలంగాణ ప్రభుత్వంతో  ఘర్షణ వైఖరికి ఇష్టపడరు. అందుకే తెలంగాణలో స్ధిరపడిన తెలుగు సినీ పరిశ్రమ కోసం వారు కనీసం మాట సాయం చేయడానికి కూడా ముందుకు రాకపోవచ్చు. 

ఏపీ ప్రభుత్వంలో సినీ పరిశ్రమకు చెందిన బాలకృష్ణ, పవన్ కళ్యాణ్‌ ఉన్నారు. సినీ ప్రముఖులలో పలువురికి వారితో, సిఎం చంద్రబాబు నాయుడుతో  సత్సంబంధాలున్నాయి. సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ ఇద్దరూ కూడా సినీ పరిశ్రమ పట్ల చాలా సానుకూలంగానే ఉంటారు. పైగా అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్న ఈ సమయంలో టాలీవుడ్‌ కదిలి రావడానికి ఇదే సరైన సమయమని పలువురు భావిస్తున్నారు.  ఇక సినిమాల కలెక్షన్ల పరంగా చూస్తే తెలంగాణ కంటే ఏపీ నుంచే సీనీమాలకు ఆదరణ ఎక్కువ. అలాగే కలెక్షన్లూ అధికం.  సినిమా స్టూడియోలు ఏర్పాటు చేసుకోవడానికి, షూటింగ్‌లు చేసుకోవడానికి ఏపీలో అన్ని హంగులూ ఉన్నాయి. కొత్తగా మరో మూడు విమానాశ్రయాలు వస్తున్నాయి. కనుక అల్లు అర్జున్ వర్సెస్ ప్రభుత్వం గొడవ దీర్ఘ కాలం కొనసాగితే మాత్రం ఏపీకి పరిశ్రమ తరలిరావడానికే సీనీ ప్రముఖులు మొగ్గు చూపుతారనడంలో సందేహం లేదు. అయినా సీనిమా సీజన్ గా చెప్పుకునే సంక్రాంతి నాటికి కూడా అల్లు అర్జున్ వివాదం సర్దుమణగకపోతే.. సినిమాల బెనిఫిట్ షోలు, ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతించకుంటే.. అప్పుడు టాలీవుడ్ కచ్చితంగా ఏపీ వైపు చూస్తుందనడంలో సందేహం లేదు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu