టీ-నోట్ పై ఎవరు అబద్ధం చెపుతున్నారు

 

కొద్ది రోజుల క్రితమే టీ-నోట్ మొదటి దశ పనులన్నీ పూర్తయ్యాయని, త్వరలో మిగిలిన పనులు కూడా పూర్తి చేసుకొని క్యాబినెట్ ఆమోదం కోసం పంపేందుకు సిద్దం అవుతుందని సాక్షాత్ హోంమంత్రి సుషీల్ కుమార్ షిండే ప్రకటించారు. నిజామాబాద్ యంపీ మధు యాష్కీతో సహా పలువురు టీ-కాంగ్రెస్ నేతలు కూడా ఇదే మాట బల్ల గుద్ది మరీ గట్టిగా చెపుతున్నారు.

 

అయితే, మంగ‌ళ‌వారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తనతో భేటి అయిన సీమాంద్ర మంత్రులతో మాట్లాడుతూ ఇంకా టీ-నోట్ సిద్దం కాలేదని, అందువల్ల త్వరలో జరుగబోయే క్యాబినెట్ సమావేశంలో అది సమర్పించే అవకాశమే లేదని ఆయన స్పష్టం చేసారు. అందుకు ఆయన తగిన కారణాలు కూడా వివరించారు. హోంశాఖ తయారు చేసిన టీ-నోట్‌ను విభ‌జ‌న‌తో సంబంధం ఉన్నప‌ది ప్రభుత్వశాఖ‌ల‌కు పంపించినపుడు, అవి దానిపై ఎటువంటి అభ్యంతరాలు లేవనెత్తకుండా, అత్యంత వేగంగా పనిచేసినప్పటికీ, అందుకు కనీసం మూడు వారాల సమయం పడుతుందని, ఒకవేళ ఏ ఒక్క శాఖ అభ్యంతరం వ్యక్తం చేసినా ఇంకా ఆల‌స్యం అవుతుందని ఆయన వివరించారు. అందువల్ల త్వరలో జరగబోయే కేంద్ర మంత్రిమండ‌లి స‌మావేశంలో టీ-నోట్ సమర్పించే అవ‌కాశమే లేద‌న్నారు.

 

ఒకవేళ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెపుతున్నదే నిజమనుకొంటే, కాంగ్రెస్ పెద్దలు, టీ- నేతలు కూడా తెలంగాణా ప్రజలను మభ్యపెడుతున్నట్లు భావించవలసి ఉంటుంది.

 

కానీ, కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజన ప్రకటన చేసి నేటికి 50రోజులయింది. తెలంగాణా ఏర్పాటుకి కృత నిశ్చయంతో ఉన్నకాంగ్రెస్ అధిష్టానం ఆరు నెలలు పట్టే విభజన ప్రక్రియను కేవలం నాలుగు నెలలలో పూర్తి చేసేందుకు కృషి చేస్తామని ఆనాడే ప్రకటించింది. అందువల్ల హోంశాఖ టీ-నోట్ తయారు చేసి ఉండి ఉంటే, ఈ యాబై రోజుల్లో ముఖ్యమంత్రి చెప్పిన ఈ తతంగం అంతా పూర్తి చేసుకొని హోంమంత్రి షిండే చెప్పినట్లు త్వరలో క్యాబినెట్ ముందుకు రావాల్సి ఉంటుంది.

 

అదే జరిగితే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉద్దేశ్య పూర్వకంగానే టీ-నోట్ తయారు కాలేదని చెపుతున్నట్లు అర్ధం అవుతుంది. ఈ విధంగా మాట్లాడి తెలంగాణా నేతల ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీయడానికో, లేక వారిలో కాంగ్రెస్ అధిష్టానంపై అనుమానాలు రేకెత్తించడానికో లేక అధిష్టానం పధకంలో భాగంగానే ఈవిధంగా మాట్లాడుతూ సీమాంధ్ర నేతలను, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నంగానో దీనిని చూడవలసి ఉంటుంది.

 

ఒకవేళ టీ-నోట్ క్యాబినెట్ ముందుకు రానట్లయితే, కాంగ్రెస్ అధిష్టానం, టీ-యంపీలు కూడా తెలంగాణా ప్రజలను మభ్యపెడుతున్నట్లు భావించవలసి ఉంటుంది. మరో రెండు మూడు రోజుల్లో ఏసంగతి స్పష్టం అయిపోతుంది.