ముగిసిన తిరుపతి గంగమ్మ‌ జాతర

తిరుపతి గంగమ్మ జాతర వేడుకగా ముగిసాయి.  బుధవారం ( మే 14) ఉదయం అమ్మవారి విశ్వరూపానికి చెంప తొలగింపు కార్యక్రమంతో ఎనిమిది రోజుల పాటు వైభవంగా సాగిన జాతర పరిసమాప్తం అయ్యింది. అమ్మవారి విశ్వరూప దర్శనాన్ని చూసేందుకు రాయలసీమ ప్రాంతం, రాష్ట్రం నలుమూలల నుంచే  కాకుండా పలు రాష్ట్రాల నుంచి కూడా జనం పోటెత్తారు.  ఆలయంలోని విశ్వరూప స్తూపానికి గంగమ్మ విశ్వరూపాన్ని తయారు చేశారు.  ఆలయం ముందు బాగంగలో గంగమ్మ బొమ్మ తయారీలో దళితులు, కుమ్మరి, కంసాలి, చాకలి, మంగళి, గొల్ల వంటి మిరాశిదార్లు పాల్గొంటారు.

గంగమ్మ బొమ్మకు కావలసినంత బంకమట్టిని పక్కనే ఉన్న కుమ్మరి వాళ్ళు   ఆచ్చారులకు అందించడం ఆనవాయితీ. అచ్చారులు నీలిమందునూనెను రంగరించి గంగమ్మ ముఖానికి నీలిరంగును అద్దారు. బంగారు పూతపూసిన చేప ఆకారంలో చెక్కిన  ముక్కెరను అలంకరించారు. బంగారం రంగురేకుల చెవులను గంగమ్మ బొమ్మకు జోడించారు. చెవులకు బంగారంలా మెరిసే సింగపూరు రేకుతో చేసిన కమ్మలు, జుంకీలను అలంకరిస్తారు. మంగళి వాళ్ళు గంగమ్మ బొమ్మ తలమీద తలవెనుక తెల్ల వెంట్రుకలను దారాల్లాగా పేర్చి, పొడవుగా వేలాడదీశారు. బంగారంలా ధగధగ మెరిసే సింగపూరు రేకుతోనే చేసిన నగిషీలు చెక్కిన కిరీటాన్ని అమ్మవారికి అలంకరించారు. కిరీటం క్రింద మల్లెపూలతోను., కనకంబరాలతోను అలంకరించారు. గంగమ్మ నుదురు భాగమంతా ఎర్రని కుంకుమను పట్టీలా పెట్టారు.  నుదురు భాగం మధ్యలో వెండితో చేసిన అడ్డనామాలను అమర్చారు. కనుబొమ్మల మధ్య గంధంతో పెద్ద బొట్టును పెట్టారు. గంగమ్మ బొమ్మ నోరు తెరుచుకొని ఉన్నట్లుగా రూపాని పెట్టారు. నోటినిండా ఎర్రకుంకుమను నింపారు. వెదురు రెబ్బలతో చేసిన పళ్ళను పెట్టారు. చాకలి వాళ్ళు తెచ్చిన చీరను గంగమ్మ బొమ్మకు కట్టారు. గొల్లవాళ్లే తెచ్చిన మంగళసూత్రాలను గంగమ్మ మెళ్ళో వేశారు. గంగమ్మ చీరకు ఒడిబాలును గొల్లవాళ్లే తెచ్చి పెట్టారు. కొద్దిసేపు బంగారు తాళిబొట్లును గంగమ్మ బొమ్మకు కట్టి తీశారు. కింద వెండితో చేసిన కన్నులను అమర్చుతారు. వెండి కన్నుల మధ్యలో నల్లని కనుగుడ్లు పెట్టడానికి ఖాళీ ప్రదేశం ఉంటుంది. కనుగుడ్లను మాత్రం చివరలో పెడ్తారు. నల్లగుడ్లను పెడితే గంగమ్మ బొమ్మకు ప్రాణం వచ్చినట్లు భావిస్తారు.

తెల్లవారు జామున పేరంటాలు తాతయ్య గుంట గంగమ్మ గుడికి పేరంటాలు చేరుకున్నాయి. గుడి ముందున్న గంగమ్మ బొమ్మను చూస్తూనే పేరంటాలు వేషానికి పూనకం వచ్చి చిందులేసి చేతితో హారతి సమర్పించింది. గంగమ్మ బొమ్మ దగ్గరుండే వారు పేరంటాలు వేషానికి హారతిచ్చి గంగమ్మ పూలహారాన్ని తీసి పేరంటాలు వేషానికి వేశారు. తర్వాత చుట్టూ ఉన్న జనం, అరుపులు, కేకలు, కిలారింపులు అధికమయ్యాయి. పంబలవారు పంబను వాయిస్తూంటే పేరంటాలు వేషధారి పంబలకు అనుగుణంగా అడుగులేస్తూ, ఆవేశంతో, ఉద్రేకంతో గంగమ్మ బొమ్మ చెంప దగ్గరుండే మట్టిని చేత్తో లాగేయడాన్నే  "గంగమ్మ చెంప నరకడం" అంటారు. పేరంటాలు వేషం వెనక్కు వెళ్ళిపోతూ ఎదురుపడ్డ వారికి ఒడిబాలులోని అక్షింతల్ని ఇస్తారు. మొదటి తాతయ్యగుంట గంగమ్మ చెంప నరికి.. అక్కడి నుంచి బస్టాండ్ సమీపంలోని తాళ్లపాక పెద్ద గంగమ్మ చెంప నరకడంతో జాతర పూర్తి అయ్యింది. తిరుపతి గంగ జాతర చాటింపుతో ప్రారంభమై వివిధ వేషాలతో, మ్రొక్కులతో, వినోదాలతో, వ్యాపారాలతో, వివిధ పూజలతో సాగి చిట్ట చివర గంగమ్మ చెంప నరకడంతో పరిసమాప్తం అయింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu