తిరుమల చేరుకున్న ఉప రాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్.. రేపు శ్రీవారి దర్శనం
posted on Aug 27, 2025 3:22PM

శ్రీవారిని దర్శించుకునేందుకు ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి, మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బుధవారం తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి అతిథి గృహం వద్ద ఆయనకు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరితో పాటు పలువురు ఉన్నతాధికారులు, కూటమి నేతలు స్వాగతం పలికారు. బుధవారం రాత్రి తిరుమలలోనే ఆయన బస చేయనున్నారు.
గురువారం ఉదయం శ్రీవారిని సీపీ రాధాకృష్ణన్ దర్శించుకోనున్నారు. అంతకుముందు రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు ప్రత్యేక విమానంలో వచ్చిన సీపీ రాధాకృష్ణన్‌కు టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు, రాష్ట్ర మంత్రి పి.నారాయణతోపాటు బీజేపీ అగ్రనేతలు నేతలు స్వాగతం పలికారు. అనంతరం ఆయన తిరుమలకు చేరుకున్నారు. ఈ ఉప రాష్ట్రపతి పదవికి సెప్టెంబర్ 9వ తేదీన ఎన్నిక జరగనుంది. అదే రోజు.. ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు. ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి బరిలో ఉన్నారు.