త్యాగాలు స‌రే.. గ్రాఫ్ పెంచుకుంటేనే టిక్కెట్‌!

పూర్వం రాజుల‌కైనా, ఇప్ప‌టి సీఎంల కైనా అధికార‌పీఠం ఇబ్బందిక‌ర‌మైన‌దే. త‌మ ప్ర‌త్యేక‌త‌లు చాటు తూ పాల‌న‌లో అద్భుతాలు చేస్తూ ప్ర‌జాభిమానాన్ని పొందితేనే నాలుగు కాలాలు పాల‌న స‌వ్యంగా సాగు తుంది. అలాగాకుండా త‌న‌కుతోచిన విధంగా త‌న మాట అంద‌రూ వినాలి, త‌న మాటేశాస‌నం అంటే మాత్రం పీఠం ఎక్కించిన‌వారే దించేస్తారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇదుగో ఇలాంటి ప‌రిస్థితే ఇపుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌రెడ్డికి ఎదుర‌యింది. ఆయ‌న ఇటీవ‌లి పాల‌నా వ్య‌వ‌హ‌రాలు ఏవీ ప్ర‌జ‌ల‌కు న‌చ్చ‌డం లేదు. అన్ని రంగాల్లోనూ అనుకున్న విధంగా ఏమీ చేయ‌లేక‌పోతున్నారు. దీనికి తోడు మంత్రుల‌ను, ఎమ్మెల్యేల‌ను హెచ్చ‌రించే కార్య‌క్ర‌మం చేస్తుండ‌ డంతో వారు జ‌నాల్లోకి వెళ్లి  ప్ర‌భుత్వ అద్భుత కార్య‌క్ర‌మాలు ప్రచారం చేయ‌డంలోనూ విఫ‌ల‌మై తిట్లు తింటూ వెన‌క్కి మాడిన మొహాల‌తో వ‌స్తూండ‌డం గ‌మ‌నిస్తున్నాం. ఇపుడు వైసీపీ నేత జ‌గ‌న్ మ‌రింత కొత్త‌గా హెచ్చ‌రించారు. సోమ‌వారం జ‌రిగి న స‌మావేశంలో  జ‌గ‌న్ ఆగ్ర‌హం బ‌య‌ట‌పెట్టారు.  మంత్రులు, ఎమ్మెల్యేలు వారి వారి ప్రాంతాల్లో ప్ర‌జల్ని ఆక‌ట్టుకుంటూ త‌మ గ్రాఫ్ పెంచుకుంటేనే వ‌చ్చేసారి టికెట్ గెలుచుకుంటార‌న్న హెచ్చ‌రిక చేశా రు. అంతే మ‌ళ్లీ అంద‌రిలో భ‌యం రెండింత‌ల‌యింది. 

రాష్ట్రంలో ఇటీవ‌ల స‌ర్వేలు నిర్వ‌హించిన సంస్థ‌లు ఏతావాతా తేల్చిందేమంటే ఈప‌ర్యాయం వైసీపీకి ఛాన్సు బ‌హుత్ క‌ష్ట్ అని. అది మీడియా ద్వారానే సీఎంకీ చేరి సీట్లో నిల‌క‌డ‌గా కూర్చోలేని ప‌రిస్థితి వ‌చ్చిం ది. దీంతో ఆయ‌న అంద‌రిమీదా కారాలు మిరియాలు నూరుతున్నారు. పైగా ఇటీవ‌లి పార్టీ ప్లీన‌రీ వ‌ల్ల పెద్ద‌గా అనుకూలత సాధించ‌క‌పోగా విమ‌ర్శ‌లే బాగా విన‌ప‌డ్డాయి. ఇక ఇపుడు నోరు పారేసుకున్న నేత‌లు త‌మ గ్రాఫ్‌ను ఎలా పెంచుకోవాలో గ‌ట్టిగానే ఆలోచించాలి. ఇటీవ‌లి దాకా ఒక లెక్క ఇప్పుడొక లెక్క‌.. అన్న తిట్టిపోశాడు.. తప్ప‌దు తిమ్మిని బొమ్మిని చేసి గ్రాఫ్ పెంచుకోవాలి. కానీ హ‌ఠాత్తుగా పెరిగిపోవ‌డానికి అదేమ న్నా పెన్సిల్‌తో గీత పెంచ‌డ‌మా?   మంత్ర‌లు, ఎమ్మెల్యేలు వారి వారి ప్రాంతాల్లో బుద్దిగా మ‌ళ్లీ తిరుగుతూ ప్ర‌జల‌కు త‌మ త‌ప్పిదాల‌ను తామే అంగీక‌రిస్తూ, క్ష‌మాప‌ణ‌లు కోరుకుంటూ ఈసారికి ఇలా వ‌దిలేయ‌మ‌ని కోరుకోవాలి. అప్ప‌టికీ ప్ర‌జ‌లు, ఓట‌ర్లు అంగీక‌రించితే వీరంతా అదృష్ట‌వంతులే. కానీ ఆ ప‌రిస్థితి అస్స‌లు కాన‌రావ‌డం లేదు. 

జ‌గ‌న్  గ‌డ‌ప గ‌డ‌ప‌కు అనే కార్య‌క్ర‌మం పై  మ‌రోసారి వ‌ర్క్‌షాప్ నిర్వ‌హించారు.  అది అతి ఘోరంగా విఫ‌ల మ‌యింద‌న్న‌ది ఆయ‌న‌కీ తెలిసొచ్చింది.  ప్ర‌జ‌లు అన్నిప్రాంతాల్లోనూ మ‌నం ఓట్లు వేసి గెలిపిం చిన పెద్ద‌మ‌నుషుల‌న్న గౌర‌వం కూడా లేకుండా, మామూలు లోక‌ల్ లీడ‌ర్ల‌ను చూసినంత చుల‌క‌న‌గానే చూస్తున్నారు. తిట్టారు, తొడ‌గొట్టి స‌వాలు చేశారు, ఒక్క మంచి ప‌నిచేశారా, ఓట్లు కోసం రావ‌డం త‌ప్పా అని మూడేళ్ల ఆగ్ర‌హాన్ని ఒక్క‌సారి కుమ్మ‌రించి మ‌రీ పంపారు. వెళ్లిన వారంతా భ‌యంతో, అవ‌మాన భారంతో నాయ‌కుని వ‌ద్ద‌కు వెళ్లి ఆ మిగిలిన తిట్లూ తిన్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఏ గ్రాఫ్ ఎంత‌ని పెంచుకోవాలి?  అస‌లు ఎదురుగా క‌న‌ప‌డితేనే నాయ‌కునికి వీరి ప‌ట్ల చిరాకేస్తోంది. ఇక ఎన్నిక‌లు ఆట్టే దూరంలో లేవు గ‌నుక ఇక‌నైనా వెళ్లి మ‌ళ్లీ జ‌నాన్ని బుజ్జ‌గించే ప‌ని చూడండి  అని మ‌రో సారి జ‌నంలోకి తోసేసారు జ‌గ‌న్‌. పార్టీకోసం, త‌న కోసం త్యాగాలు చేశార‌ని ద‌యాదాక్షిణ్యాలు చూపించే ఛాన్స్‌కూడా లేద‌న్న‌ది జ‌గ‌న్ ఆగ్ర‌హం తాత్ప‌ర్యం. అందువ‌ల్ల అలా జ‌గ‌న్‌కు ద‌గ్గ‌ర‌గా వున్నామ‌ని, వారి ద‌య‌కు పాత్రుల‌య్యామ‌ని అనుకుంటున్న ఎమ్మెల్యేలు, మంత్రులూ ఇక ఈ కొద్దికాలం గ‌ట్టిగా త‌మ కోస‌మైనా శ్ర‌మించాల్సిన అవ‌స రం ఎంతైనావుంది. లేక‌పోతే  నాయ‌కుడు, పార్టీతో పాటు ప్ర‌జ‌లు త‌మ‌ని వ‌దిలేయ‌డం ఖాయ మ‌న్న‌ది ఈ స‌రికే వారంతా గ్ర‌హించే ఉండాలి.  ఎందుకంటే గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ అనే కార్య‌క్ర‌మంలో పార్టీ నిర్దేశించిన మార్గ ద‌ర్శ‌కాల ప్ర‌కారం 15 మంది ఎమ్మెల్యేలు మాత్ర‌మే పొల్గొంటున్నార‌ని 50 మంది అస‌లు వారి ఇంటి గ‌డ‌పే దాట‌లేద‌ని జ‌గ‌న్ ఆగ్రహించారు.  కార్యక్రమం నెలలో 16-20 రోజులు పాల్గొనాలని స్పష్టం చేశారు. 20 రోజులలో కనీసం ఆరు లేదా ఏడు గ్రామ, వార్డు సచివాలయాల్లో పర్యటించాలన్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం వైసీపీకి సానుకూల వాతావరణం ఉందని జగన్‌ తెలిపారు. ప్రతి గ్రామంలో, ప్రతి నియోజకవర్గంలో 87 శాతం మందికి ప్రభుత్వం లబ్ధి చేసిందన్నారు. అందుకే మొత్తం 175 స్థానాలూ సాధించడం కష్టం కాదన్నారు. విజయవాడ, విశాఖ కార్పొరేషన్‌లకు నిధులు కేటాయించాలని ఎమ్మె ల్యేలు కోరినా  సీఎం స్పందించలేదు. ‘సీఎం డెవల్‌పమెంట్‌ ఫండ్‌’ కింద నియోజకవర్గ అభివృద్ధికి రెండు కోట్లు.. గ్రామానికి రూ.20 లక్షల చొప్పున విడుదల చేసే బాధ్యతను తాను తీసుకుంటున్నానని జగన్‌ చెప్పారు. ఎమ్మెల్యేలు విజిట్‌ చేసిన 2 రోజుల్లో రూ.20 లక్షల నిధులు ఇచ్చేలా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామన్నారు.  

పట్టభద్రుల స్థానాల్లోనూ వైసీపీ పోటీపట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఈసారి పార్టీ తరఫున అభ్యర్థులను బరిలోకి దింపుదామని వైసీపీ ఎమ్మెల్యేలతో సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. ఇప్పటి వరకూ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా బరిలో ఉన్నవారికి బయటి నుంచి మద్దతిస్తూ వస్తున్నామ ని.. ఈసారి వైసీపీ తరఫున మనమే అభ్యర్థిని బరిలో కి దింపుదామని అన్నారు. కాగా..  నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేర్నాటి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డిని వైసీపీ ప్రకటించింది. తిరుపతి జిల్లా కోట మండలానికి చెందిన ఈయన వ్యవసాయ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి అనుచరుడు. ఈయన భార్య సుస్మితారెడ్డి రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు. ఇప్పటికే ఈ నియోజకవర్గానికి తమ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కందుకూరుకు చెందిన కంచర్ల శ్రీకాంత్‌ను టీడీపీ ప్రకటించింది. వచ్చే ఏడాది జరిగే ఈ ఎన్నికలకు అప్పుడే అభ్యర్థులను ప్రకటిస్తుండడం విశేషం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu