వంశీ, రాజ్ కసిరెడ్డి, పీఎస్సార్ ఆంజనేయులు.. ఒకే జైలు.. ఒకే బ్యారక్

వేర్వేరు కీలక కేసుల్లో నిందితులుగా ఉన్న ముగ్గురు ప్రముఖులు ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో ఒకే బ్యారక్‌లో  ఉన్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, మద్యం కుంభకోణం ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి, ముంబై నటి కాదంబరి జత్మలానీని వేధించిన కేసులో అరెస్టయిన పీఎస్ఆర్ ఆంజనేయులు విజయవాడ జైలులోని ఒకే బ్యారక్‌లో వేర్వేరు సెల్స్‌లో రిమాండ్‌లో ఉన్నారు.

 తెలుగుదేశం కార్యాలయ సిబ్బంది కిడ్నాప్ కేసుకు సంబంధించి వల్లభనేని వంశీ ఇప్పటికే  చాలా రోజులుగా విజయవాడ జిల్లా జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. తాజాగా, మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన రాజ్ కసిరెడ్డి, ముంబై నటి కాదంబరి జత్వాని కేసులో పీఎస్ఆర్ ఆంజనేయులు ఒకరి తర్వాత ఒకరు ఇదే జైలుకు రిమాండ్ ఖైదీలుగా వచ్చారు.  ఈ ముగ్గురినీ కూడా ఒకే బ్యారక్ లోని వేరువేరు సెల్స్ లో జైలు అధికారులు  ఉంచారు.  

ముగ్గురు ప్రముఖులు ఒకే బ్యారక్‌లో ఉండటంతో జైలు అధికారులు భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. వారి కదలికలను పర్యవేక్షించేందుకు, భద్రతా కారణాల దృష్ట్యా ముగ్గురి సెల్స్‌లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు సమాచారం. వేర్వేరు కేసుల్లో అరెస్టయిన ఈ ముగ్గురు వ్యక్తులు ఒకే బ్యారక్‌లో ఉండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ఇలా ఉండగా వల్లభనేని వంశీ, పీఎస్సార్ ఆంజనేయులు మధ్య గతంలో తీవ్ర స్థాయిలో విభేదాలు ఉండేవని చెబుతారు. మొత్తం మీద జగన్ హయాంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ముగ్గురు ప్రముఖులు.. ఆ సమయంలో తాము చేసిన చర్యల కారణంగా అరెస్టై ఒకే జైలులో ఒకే బ్యారక్ లో ఉండటం కాకతాళీయమే అయినా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.