కష్టజీవులకు సలాం!!

కష్టజీవులు ఎవరు?? తమ స్వేదాన్ని ధారపోసి దేశాలను నడిపిస్తున్నవారు. వారే లేకుంటే ఏ దేశానికి కూడా అభివృద్ధి అనేది శూన్యం. ఒక విత్తనాన్ని నాటిన తరువాత అది మొలక వచ్చి, మొక్కగా మారి, ఎదుగుతూ వృక్షమై పండ్లను, పువ్వులను ఇస్తుందంటే దానికి భూమి లోపలి నుండి వేర్ల ద్వారా పోషకాలు, నీరు మొదలైనవి అందుతూ ఉండటం వల్లనే దాని ఎదుగుదల సాధ్యమయ్యింది. ఆ చెట్టుకు కనుక వేర్లు లేకపోతే అది క్రమంగా పచ్చదనం కోల్పోయి, వాడిపోయి, మోడుగా మిగిలిపోతుంది. 


దేశము ఒక వృక్షమైతే, దేశాన్ని నడిపిస్తున్న కార్మికులు వేర్ల వంటి వాళ్ళు.  కానీ సమాజంలో ఏమి జరుగుతుంది??


కార్మికులంటే ఒకానొక చిన్న చూపు అందరికీ. ఎంత చిన్న చూపు అంటే బయట ఎవరి వల్ల అయినా ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు, ఇంట్లో వాళ్ళ వల్ల ఏదైనా ఇబ్బంది ఎదుర్కొన్నప్పుడు, ఎవ్వరిమీద అయినా కోపం ఉన్నప్పుడు ఇలా మనిషి జీవితంలో ఉన్న ఎన్నో రకాల అనిశ్చితి మరియు అసహన సందర్భాలలో బయటి చిన్న కార్మికులపైన ఆ కోపం, చిరాకు, అసహనాన్ని తొందరగా వెళ్లగక్కేస్తూ ఉంటారు చాలా మంది. అయితే ఆ చిన్న కార్మికులకు ఆ పని తప్ప వేరే ఏవిధమైన ఆదాయవనరు లేకపోవడం వల్ల మనసు చంపుకుని ముందుకు వెళ్ళిపోతారు.


ఈసమాజంలో డబ్బుంటే చాలు బ్రతకవచ్చు అనుకునేవాళ్ళు ఒకసారి కార్మికులు, తమకు అవసరమైనవి అన్నీ సమకూర్చి పెట్టేవాళ్ళు లేకపోతే ఎలా?? అనే ఒకానొక ప్రశ్న వేసుకుంటే దిక్కులు చూడాల్సి వస్తుంది తప్ప సమాధానం దొరకదు.  ఎందుకంటే కార్మిక శక్తిని కాదని ఈ ప్రపంచం బ్రతకలేదు. ఒకవేళ వాళ్ళను కాదని బతకడానికి ప్రయత్నం చేసినా కొన్ని పనులు చేసుకోవడానికి ఈ ప్రపంచానికి ఆ కార్మికులు, శ్రామికులే అవసరం అవుతారు. అంతటి గొప్ప కార్మికుల విషయంలో ఈ ప్రపంచం చర్య ఎలా ఉంటుంది అంటే శ్రమ దోపిడీ రూపంలో ఉంటుంది.


ప్రపంచం కార్మిక దినోత్సవాన్ని మే 1వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు. ఈరోజు వెనక ఉద్దేశం అందరితో సమానమైన పని గంటలు అన్ని రకాల పనులు చేసేవారికి కావాలని చేసిన పోరాట పలితం, పనికి తగ్గ వేతనం కావాలని చేసిన పోరాట పలితం.


తన పేరుతోనే  ఒక గొప్ప విప్లవాన్ని ప్రపంచానికి పరిచయం చేసినవాడు కార్ల్ మర్క్స్. ఈయన గొంతెత్తి "ప్రపంచ శ్రామికులారా ఏకం కండి. పోరాడితే పోయేదేమి లేదు సంకెళ్లు తప్ప" అని గొంతెత్తి ప్రపంచ కార్మికులకు, కష్టపడి పనిచేసి శ్రమదోపిడికి గురవుతున్న వాళ్లకు పిలిలుపిచ్చాడు. ఈ శ్రమదోపిడి అనేది ఎన్నో ఏళ్లకేళ్ళుగా ఎన్నెన్నో దేశాలలో సాగుతున్న ఒక దారుణ వ్యవస్థ. దీన్ని  అంతమొందించాలని కార్మికుల కోసం కార్ల్ మార్క్స్ కూడా పోరాటం చేసాడు.  రెండు వందల సంవత్సరాల క్రితం కార్ల్ మార్క్స్ నినాదం నేటి తరానికి కూడా సరిగ్గా సరిపోతోంది అంటే ఈ సమాజం అభివృద్ధిలో శ్రామికులు అలాగే ఉన్నారు కానీ బడా బాబులే బాగా ఎదుగుతున్నారని అనిపిస్తోంది. అయితే అక్షరాస్యత కలిగిన వారికి  కాస్త ప్రశ్నించే తత్వం ఉందని సంతోషపడదామని అనుకునే లోపు ఎంతటి వారైనా ఈ దోపిడికి గురవుతున్నవారే అని నేటి ఉద్యోగాల తీరు, ఆఫీసు పని గంటలు, యాజమాన్యాల ఒత్తిడి స్పష్టం చేస్తున్నాయి.


8 గంటల పని, 8 గంటల విశ్రాంతి, 8 గంటల రీక్రియషన్ అనే వాటిని సాధించుకోవడానికి పనులు మానేసి నిరసన తెలుపుతూ కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి మేము మనుషులమే మా శ్రమకు పరిమితులు కావాలని వాటిని సాధించుకున్న రోజు. 


మే డే అనగానే ప్రపంచాన్ని వారి శక్తిని స్మరించుకుని వదిలేయకుండా వాటి కష్టాన్ని గుర్తించి, వారి శ్రమను దోచుకోకుండా శ్రమకు తగ్గ పలితాన్ని వారికి ఎల్లవేళలా అందించడమే సాటి పౌరులు మరియు ప్రపంచ దేశాల కర్తవ్యం అని తెలుసుకోవాలి.


                                ◆వెంకటేష్ పువ్వాడ.