పంజాబ్ లో ఉగ్రవాదుల దాడి, 9మంది పౌరులు మృతి

 

ఈరోజు తెల్లవారు జామున పంజాబ్ రాష్ట్రంలోని గురుదాస్ పూర్ జిల్లాలో దీనానగర్ పోలీస్ స్టేషన్ పై ఉగ్రవాదులు చేసిన దాడిలో పౌరులు, పోలీసులు కలిపి మొత్తం 9మంది మరణించారు. ఉగ్రవాదులు మొదట అమ్రిత్ సర్ వెళుతున్న బస్సులో ప్రయాణికులపై విచక్షణారహితంగా కాలుపులు జరిపారు. ఆ తరువాత పోలీస్ స్టేషన్ పై దాడి జరిపారు. ఒక హోటల్ యజమానిని బెదిరించి అపహరించుకొని వచ్చిన మారుతీ కారులో వారు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొన్నారు. వారందరూ సైనిక దుస్తులు ధరించి చేతిలో అత్యాధునిక ఆయుధాలతో పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి విచాక్షానా రహితంగా పోలీసులపై కాల్పులు జరుపడంతో అక్కడికక్కడే 9మంది మరణించారు. ఈ సంగతి తెలుసుకొన్న రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అదనపు బలాలను అక్కడికి పంపించి ఉగ్రవాదులను నిలువరించే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య హోరాహోరీ కాల్పులు జరుగుతున్నాయి. అంతకు ముందు పఠాన్ కోట్-గురుదాస్ పూర్ రైల్వే ట్రాక్ పై ఉగ్రవాదులు ఐదు బాంబులను కూడా అమర్చారు. కానీ భద్రతా దళాలు సకాలంలో వాటిని గుర్తించి తొలగించడంతో పెను ప్రమాదం తప్పిపోయింది.