తడబడిన తెలుగు తేజాలు!

పారిస్ ఒలింపిక్స్.లో పాల్గొన్న మన తెలుగు తేజాలు సింధు, సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, నిఖత్ జరీన్ సంచలనాలు సృష్టిస్తారని ఆశించాం. వాళ్ళు అలా పతకాలు గెలవగానే ఇలా పండగ చేసుకోవడానికి సిద్ధంగా వున్నాం. కానీ, జీవితమే ఒక ఆట... ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు.. మరి జీవితంలో ఒక భాగం అయిన ‘ఆట’ అయితే... ఎన్నెన్నో మలుపులు. మన తెలుగు తేజాల విషయంలో కూడా ఊహించని మలుపులు వచ్చాయి. సంచలనాలకు కొద్ది దూరంలో వుండగానే పరాజయం పలకరించింది. అయినప్పటికీ బాధపడాల్సింది ఏమీ లేదు. ప్రయత్నం చేయడం ప్రతిభ అయితే, ఫలితాన్ని ఆశించకపోవడం ప్రజ్ఞ అనిపించుకుంటుంది. ఈసారికి మన తెలుగు తేజాలు ఒలింపిక్స్ స్థాయిలో పోరాటం చేసి విజయం దగ్గర వరకూ వెళ్ళారని సంతృప్తి పడాలి. వారి పోరాటం కొనసాగించడానికి ప్రోత్సాహం అందించాలి.

రియో ఒలింపిక్స్.లో రజతం, టోక్యో ఒలింపిక్స్.లో కాంస్యం సాధించి, ఈసారి కూడా హాట్ ఫేవరెట్‌గా వుండి, ఈసారి స్వర్ణం సాధిస్తుందన్న ఆశను కలిగించిన పి.వి. సింధు ఈసారి క్వార్టర్స్‌కు కూడా చేరకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. గురువారం బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ప్రీ క్వార్టర్  ఫైనల్స్‌లో చైనా క్రీడాకారిణి హే బిన్‌జియావో చేతిలో సింధు 19-21, 14-21తో ఓటమి చవిచూసింది. 

బ్యాడ్మింటన్‌లో భారత్‌కి తొలి డబుల్స్ పతకాన్ని అందిస్తారని అందరూ ఆశించిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి - చిరాగ్ శెట్టి జోడీ నిరాశపరచింది. గురువారం జరిగిన క్వార్టర్స్ ఫైనల్లో ఈ జోడీ 21-13, 21-14, 21-16 తేడాతో మలేసియాకి చెందిన ఆరోన్ - సో వూయీ చేతిలో ఓడిపోయారు.

పారిస్ ఒలింపిక్స్‌లో భారత ఆశల్ని పెంచిన బాక్సర్ నిఖత్ జరీన్ పోరాటం ప్రి-క్వార్టర్స్‌లో ముగిసింది.  50 కేజీల విభాగంలో పోటీప‌డ్డ నిఖ‌త్ జ‌రీన్‌ చైనాకు చెందిన వూ యూకి నిఖత్ జరీన్ పోటీ ఇవ్వలేకపోయింది.  5-0 తేడాతో నిఖ‌త్ బాక్సింగ్ బౌట్‌ను కోల్పోయింది.

మొత్తమ్మీద మన ముగ్గురు తెలుగు తేజాలూ ఒకేరేజు (గురువారం) నాడు ఒలింపిక్స్ పోటీ నుంచి నిష్క్రమించారు. ఈ ఓటమి నుంచి ఈ ముగ్గురూ పాఠాలు నేర్చుకుంటారని, ఈసారి ఒలింపిక్స్.లో పతకాలను సాధిస్తారని, భారత పతాకాన్ని విశ్వవీధిలో రెపరెపలాడిస్తారని ఆశిద్దాం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu