షర్మిలకు టీటీడీపీ కౌంటర్ ప్లాన్! అదే జరిగితే కేసీఆర్ కు కష్టమే?  

తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య, కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్నారన్న ప్రచారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. షర్మిల పార్టీ ఏర్పాటు వెనక కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయని భావిస్తున్న తెలుగు దేశం పార్టీ... వాళ్లకు కౌంటర్ ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు. ముఖ్యంగా వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెట్టడానికి కేసీఆర్ ప్రయోజనాలు ఉన్నాయనే అంచనాకు వచ్చిన తెలంగాణ తమ్ముళ్లు...  టీఆర్ఎస్ కు షాకిచ్చేందుకు సిద్ధమవుతున్నారని చెబుతున్నారు.

తెలంగాణలో టీడీపీ గతంలో బలంగా ఉండేది. రాష్ట్ర విభజన తర్వాత కూడా టీడీపీకి కేడర్ అలాగే ఉంది. పార్టీ నేతలు మారినా.. కార్యకర్తలంతా అలాగే  ఉన్నారని, బలమైన నాయకుడు వస్తే తెలంగాణలో మళ్లీ టీడీపీ పుంజుకోవడం ఖాయమనే చర్చ ఉంది. ఈ నేపథ్యంలో షర్మిల పార్టీకి కౌంటర్ తో పాటు టీడీపీని టార్గెట్ చేసిన కేసీఆర్ కు ఝలక్ ఇచ్చేలా..  తెలంగాణ తమ్ముళ్లు ప్రణాళికలు రచిస్తున్నారని తెలుస్తోంది. టీఆర్ఎస్ లో ప్రస్తుతం చాలా మంది నేతలు అసంతృప్తిగా ఉన్నారు.  బంగారు తెలంగాణ, ఉద్యమ తెలంగాణ వర్గాలుగా ఆ పార్టీ విడిపోయిందంటున్నారు. దీంతో గులాబీ పార్టీలో నారాజ్ గా  ఉన్న నేతలతో పాటు.. గతంలో టీడీపీలో కీలక పదవులు అనుభవించి.. ప్రస్తుతం టీఆర్ఎస్ లో అనామక లీడర్లుగా మిలిగిపోయినవారిని తిరిగి సొంత గూటికి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయట.  

టీడీపీకి తెలంగాణలో బలమైన కేడర్ ఉందని.. సరైన లీడర్ వస్తే వారంతా యాక్టివ్ అవుతున్నారని రాజకీయ అనలిస్టులు కూడా  చెబుతున్నారు. ప్రస్తుతం ఇతర పార్టీల్లోనే ఉన్న నేతలంతా తిరిగి సొంత గూటికి వస్తారని అంటున్నారు. అందుకే  గ‌తంలో తెలంగాణ టీడీపీలో కీలకంగా ప‌నిచేసి..ఇప్పుడు రాజ‌కీయ అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతున్న నేత‌ల‌ను కూడ‌గ‌ట్టే బాధ్య‌త‌ను కొందరికి  చంద్ర‌బాబు  అప్పగించారని చెబుతున్నారు.  అందులో భాగంగానే ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ మంత్రితో కొందరు టీడీపీ నేతలు టచ్ లోకి వెళ్లినట్లు, ఆయనకు తెలంగాణ పార్టీ  పగ్గాలు ఆఫర్ చేసినట్లు చెబుతున్నారు. ఆ జిల్లాలో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలతో ఆ నేత అధికార పార్టీపై అసహనంగా ఉన్నారని తెలుస్తోంది. ఆ నేత తిరిగి సొంత గూటికి వస్తే మాత్రం తెలంగాణ రాజకీయ సమీకరణలు పూర్తిగా  మారిపోయే అవకాశం ఉందంటున్నారు.  

తెలంగాణలో 119 నియోజకవర్గాలుండగా .. దాదాపు 35 నియోజకవర్గాల్లో సీమాంధ్ర ఓటర్లు కీలకంగా ఉన్నారు.  గ్రేటర్ హైదరాబాద్ తో పాటు శివారు నియోజకవర్గాల్లో గెలుపోటములను నిర్ణయించేది వారే. ఇవన్ని ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గాలే. గ్రేటర్ పరిధిలోని శేరి లింగంపల్లిలో 3.8 లక్షలు, కుత్బుల్లాపూర్ లో 2 లక్షలు, కూకట్ పల్లి లక్షా 20 వేలు, రాజేంద్రనగర్ లో లక్ష మంది సెటిలర్ ఓటర్లున్నారు. ఉప్పల్, మేడ్చల్ , మల్కాజ్ గిరి , పటాన్ చెరు నియోజకవర్గాల్లో 70 నుంచి 80 వేల మంది సీమాంధ్ర ఓటర్లున్నారు. మరో 12 నియోజకవర్గాల్లో 20 వేలకు పైగా సెటిలర్లు ఉన్నారు. ఆయా నియోజకవర్గాల్లో వాళ్లు మద్దతు ఇచ్చిన పార్టీలకే గెలిచే అవకాశాలుంటాయని చెబుతారు. టీడీపీ యాక్టివ్ అయితే ఈ నియోజకవర్గాలన్ని పసుపు కోటాలో పడతాయని భావిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం, నిజామాబాద్  జిల్లాలోనూ టీడీపీ బలంగా ఉంది. 

తెలంగాణలోని   మొత్తం 119 నియోజకవర్గాల్లో 35కు పైగానే..  అంటే మూడో వంతు నియోజకవర్గాల్లో టీడీపీకి మంచి అవకాశాలు ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో హంగ్ ఫలితాలు వస్తే.. ముఖ్యమంత్రి సీటు కైవసం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అందుకే బలమైన నేతలను తిరిగి పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాల్లో టీడీపీ పెద్దలు సీరియస్ గా వర్క్ చేస్తున్నారని తెలుస్తోంది. అదే జరిగితే సీఎం కేసీఆర్ కు గడ్డు కాలమేనని అంచనా వేస్తున్నారు. తెలంగాణలో జరుగుతున్న తాజా పరిణామాలతో టీడీపీకి మంచి రోజులు రాబోతున్నాయని.. గులాబీ పార్టీలో గుబులు పెరుగుతుందనే ప్రచారం జరుగుతోంది.