తెలంగాణ మంత్రి రాసలీలలు! సోషల్ మీడియాలో రచ్చ 

తెలంగాణలో ఓ మంత్రి ఇబ్బందుల్లో పడ్డారు. కరీంనగర్ జిల్లాకు చెందిన ఆ మంత్రి రాసలీలకు సంబంధించిన వాట్సాప్ చాటింగ్ స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ కావడం కలకలం రేపుతోంది. ఆ మంత్రి  వ్యవహారంపై టీఆర్ఎస్ అధిష్టానం ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఇంటెలిజెన్స్ విభాగం రంగంలోకి దిగిందని చెబుతున్నారు. సోషల్ మీడియాలో రచ్చ కావడంతో ఆ మంత్రి టీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి సంజాయిషీ ఇచ్చుకునే పనిలో పడ్డారు.

 

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వాట్సాప్ చాటింగ్ వివరాల ప్రకారం కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి సినీ నటితో సరసాలు చేయాలనుకున్నారు. అయితే, ఆ విషయం ఆమెతో నేరుగా చెప్పకుండా మరో మహిళను రంగంలోకి దింపాడు. మంత్రి తరఫున రంగంలోకి దిగిన ఆ మహిళ సినీ నటితో చర్చలు మొదలు పెట్టింది. మంత్రి చాలా మంచి వాడని, అతడితో చాలా పనులు ఉంటాయని, టచ్‌లో ఉంటే మంచిదంటూ చెప్పడం మొదలు పెట్టింది. అయితే, ఆ సినీ నటి ఇవేవీ పట్టించుకోలేదు. ఈ క్రమంలో మంత్రి నియమించిన మహిళ ఏకంగా మరో దుశ్చర్యకు పాల్పడింది. ఆ సినీ నటికి సంబంధించిన ప్రైవేట్ ఫొటోలను కూడా తీసింది. ఆ ఫొటోలను మంత్రికి పంపించింది. 

 

ఆ మహిళతో ఏదో మామూలుగా మాట్లాడుతున్న సమయంలో ఆ మహిళ సెల్ ఫోన్ చూసిన సినీ నటికి అందులో తన ప్రైవేట్ ఫొటోలు ఉండడం గమనించి షాక్ తింది. ఆ సినీ నటి గురించి మంత్రితో మహిళ చర్చించిన అంశాలు కూడా వాట్సాప్ ఛాటింగ్ లో ఉన్నాయి. దీంతో మరింత షాక్ తిన్న సినీ నటి .. ఆ మహిళ ఫోన్ తీసుకుని ఆ సమాచారం మొత్తం స్క్రీన్ షాట్లు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందని చెబుతున్నారు.

 

'మన దేశ రాజధానిలో నిర్భయపై జరిగిన హింసాకాండ. మన రాష్ట్ర రాజధానిలో దిశపై జరిగిన హింసాకాండ. నేటికీ ఏ మార్పు రాలేదు. మహిలలపై ఈ హింసని మనం పోరాడి సాధించుకున్న తెలంగాణలో కూడా ఆపలేమా? మన తెలంగాణ నాయకులు ఏం చేస్తున్నారు? ఒకవేళ మనం నమ్మిన నాయకులే మహిళలపై రాక్షస వాంఛతో ప్రవర్తిస్తే వాళ్లని ఏం చేయాలి?' అంటూ బాధితురాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తెలంగాణలోని ఓ ప్రముఖ పట్టణంలోని హోటల్లో ఆమె ఉన్నప్పుడు సదరు మంత్రి ఒంటరిగా హోటల్‌కు వెళ్లినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. యువతి బస చేసిన హోటల్లో రికార్డులను ప్రభుత్వ ఇంటిలిజెన్స్ పరిశీలించినట్టు సమాచారం. అలాగే సీసీ టీవీ ఫుటేజ్‌ను కూడా పరిశీలించారని తెలుస్తోంది.