హోమ్ మంత్రి మనవడి అరాచకం... 

ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండమని చెప్తారు మన పెద్దలు. అలాగే కొంతమంది నాయకులు ఎంత గొప్పవారైనా ఎంత పేరు ప్రఖాయతులు తెచ్చుకున్నా వారి వారసులు మాత్రం పెద్దల పరువు తీసే పనిలో యమా బిజీగా ఉంటారు. తాజాగా ఇటువంటి ఘటన ఒకటి తెలంగాణలో చోటు చేసుకుంది

రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ మ‌న‌వ‌డు ఫ‌రాన్ అహ్మ‌ద్ తాజాగా ఒక వివాదంలో చిక్కుకున్నాడు. అతడు చదివే కాలేజీలో తోటి విద్యార్థుల‌ను ర్యాగింగ్ చేస్తున్నాడ‌ని తాజాగా పోలీస్ స్టేష‌న్లో ఒక కేసు న‌మోదైంది. మా తాత హోం మంత్రి మ‌హ‌మూద్ అలీ అని చెప్పి మరీ బెదిరిస్తూ.. త‌మ‌ను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని అతడి తోటి విద్యార్థులు పంజాగుట్ట పోలీసుల‌కు కంప్లైంట్ చేశారు. హోంమంత్రి పేరు చెప్పి అయన మ‌న‌వ‌డు చేస్తున్న అరాచకాలనుండి తమను కాపాడాలంటూ వారు పోలీసులకు విజ్ఞ‌ప్తి చేశారు. ఫ‌రాన్ చేసిన ర్యాగింగ్‌ దాడిలో గాయపడిన రియాన్ అనే ఒక విద్యార్థి మీడియా సమావేశంలో తనకు అయిన గాయాన్ని చూపాడు ఈ ర్యాగింగ్ ఘట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. 

హోం మంత్రి మ‌న‌వ‌డు గ‌తంలోనూ పలు వివాదాలలో ఉన్నాడు. గతంలో పోలీసు శాఖకు చెందిన ఒక వాహనంపై కూర్చొని టిక్‌టాక్ వీడియో చేసిన ఘ‌ట‌న తీవ్ర దుమారం రేపింది. ఎంత హోమ్ మంత్రి మనవడైతే మాత్రం ఇలా తోటి విద్యార్థులను హింసించి పైశాచిక ఆనందం పొందడమేంటని విద్యార్థులు తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.