దిశ కేసులో మరో మలుపు... ఎన్ కౌంటర్ పై సిట్ ఏర్పాటు...

దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన దిశ రేప్ అండ్ మర్డర్ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేయడంతో ప్రజాగ్రహం చల్లారినా... న్యాయ వ్యవస్థ నుంచి పోలీసులు విచారణను ఎదుర్కోవాల్సి వస్తోంది. దిశ నిందితుల ఎన్ కౌంటర్ కు వ్యతిరేకంగా వివిధ కోర్టుల్లో ఇప్పటికే అనేక పిటిషన్లు దాఖలు కాగా... జాతీయ మానవ హక్కుల కమిషన్ రంగంలోకి విచారణ జరుపుతోంది. అసలు దిశ హత్యాచార ఘటన ఎలా జరిగింది... పోలీసుల దర్యాప్తు... ఆ తర్వాత నిందితుల ఎన్ కౌంటర్ కు దారి తీసిన పరిస్థితులు... ఇలా అన్నింటినీ క్షుణ్ణంగా అధ్యయనం చేస్తోంది ఎన్ హెచ్ ఆర్సీ బృందం. చటాన్ పల్లిలోని ఎన్ కౌంటర్ స్పాట్ ని పరిశీలించిన ఎన్ హెచ్ ఆర్సీ టీమ్... ఆ తర్వాత నిందితుల డెడ్ బాడీస్ ను చెక్ చేసింది. అనంతరం దిశ పేరెంట్స్ అండ్ నిందితుల తల్లిదండ్రుల నుంచి స్టేట్ మెంట్స్ రికార్డు చేసుకున్నారు.

అయితే, దిశ నిందితుల ఎన్ కౌంటర్ వివాదాస్పదమవుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం కూడా రంగంలోకి దిగింది. అసలు ఎన్ కౌంటర్ ఎలా జరిగిందో... కాల్పులకు దారి తీసిన పరిస్థితులేంటో తేల్చాలంటూ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో ఈ సిట్ ను నియమించింది. ఈ ప్రత్యేక దర్యాప్తు బృందంలో వనపర్తి ఎస్పీ అపూర్వరావు, మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి, రాచకొండ ఎస్ వోటీ డీసీపీ సురేందర్, సంగారెడ్డి డీఎస్పీ శ్రీధర్, సంగారెడ్డి డీసీఆర్బీ సీఐ వేణుగోపాల్ రెడ్డి సభ్యులుగా ఉన్నారు. చటాన్ పల్లి ఎన్ కౌంటర్ పై పూర్తిస్థాయి విచారణ జరపాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఎదురుకాల్పుల్లో పాల్గొన్న పోలీసులు, ఎస్కార్ట్ సిబ్బంది, ఆ సమయంలో అక్కడున్న అధికారులను సిట్ ప్రశ్నించనుంది. అలాగే, ఎన్ కౌంటర్ కు దారి తీసిన పరిస్థితులను సేకరించి నివేదిక ఇవ్వనుంది. 

అయితే, ఒకవైపు NHRC విచారణ జరుపుతుండగానే... మరోవైపు ఆగమేఘాల తెలంగాణ ప్రభుత్వం కూడా సిట్ వేయడం సంచలనంగా మారింది. సిట్ నియామకం సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకే అయినప్పటికీ... ఎన్ కౌంటర్ జరిగిన మూడ్రోజుల తర్వాత దర్యాప్తునకు ఆదేశించడం కీలకంగా మారింది.