తెలంగాణ ప్రభుత్వ ఖజానా ఖాళీ

 

రాష్ట్రం విడిపోయిన తరువాత ఆంధ్రరాష్ట్రానికి ఆర్ధిక లోటు ఉంటే తెలంగాణ రాష్ట్రానికి మాత్రం మిగులు బడ్జెట్ బానే ఉంది. విభజన తరువాత తెలంగాణకు మిగులు బడ్జెట్ తో దేశంలోనే ధనిక రాష్ట్రం గుజరాత్ తరువాత తెలంగాణ ఏకైక మిగులు రాష్ట్రంగా మిగిలింది. కానీ ఇప్పుడు చూడబోతే తెలంగాణ రాష్ట్రానికి ఆర్ధిక కష్టాలు వచ్చినట్టు తెలుస్తోంది. పరిస్థితి ఎక్కడివరకూ వచ్చిందంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా చేయాల్సిన గోదావరి పుష్కరాలకు.. రంజాన్ సందర్భంగా ముస్లింలకు కేసీఆర్‌ ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన ‘రంజాన్‌ కానుక’లక కూడా సొమ్ముల్లేవు. అసలు తెలంగాణకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే సీఎం కేసీఆర్ మిగులు బడ్జెట్ ఉంది కదా అని రైతుల రుణమాఫీలు.. ఉద్యోగుల వేతనాలు పెంపు.. అంటూ లెక్కాపత్రం లేకుండా కోట్లకు కోట్లు ఖర్చుచేసేశారు. దీనికి తోడు బ్రూవరేజెస్‌ కార్పొరేషన్‌ చెల్లించాల్సిన ఆదాయపు పన్ను రూ.1260 కోట్లను రిజర్వు బ్యాంకు చెప్పాపెట్టకుండా లాగేసుకోవడంతో తెలంగాణకు కష్టాలు తీవ్రమయ్యాయి. దీంతో తెలంగాణ ఆర్ధిక శాఖ అన్ని బిల్లుల చెల్లింపుకు ఇవ్వాల్సిన నిధుల విడుదలను ఆపేసింది. ఆఖరికి... కోటి రూపాయలను విడుదల చేయాల్సి వచ్చినా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేదా ముఖ్యమంత్రి అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కనీసం ఐటీ శాఖకు మళ్లించిన 1260 కోట్ల రూపాయలను అడ్వాన్సు రూపంలోనైనా ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతున్నా కేంద్రం మాత్రం చూద్దాం చేద్దాం అంటూ మాటలు చెపుతుంది. దీనిపై తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు రోజుకు ఐదారుసార్లు కేంద్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి అలసిపోతున్నారు తప్ప కేంద్రం మాత్రం ఎటువంటి చర్య తీసుకోవడం లేదు. మొత్తానికి ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవుతాయి అన్న సామెత ప్రకారం మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణ ప్రభుత్వానికి ఆర్ధికంగా ఎలాంటి లోటు లేదు కాబట్టి అభివృద్ధిపథంలో ముందుకు కొనసాగుతుందని భావించాం.. కానీ రాష్ట్రం విడిపోయిన ఏడాదికే టీ ఖజానా ఖాళీ అయి.. నిధులకోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది.