వారంలో తెలంగాణ ఎన్నికల నగారా!

వారం రోజులలోగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. మొత్తం ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం వారం రోజులలోగా షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. హస్తిన వర్గాల విశ్వసనీయ సమాచారం మేరకు ఈ నెల 10 ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కానుంది. ఆ షెడ్యూల్ మేరకు తెలంగాణ ఎన్నికలు తొలి దశలోనే జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే 2018 లోనూ అలాగే జరిగింది. దానిని బట్టి ఈ సారి కూడా అదే విధంగా జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ గత కొన్ని రోజులుగా వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న సంగతి విదితమే. అనారోగ్యంగా ఉండి కూడా రాష్ట్రంలో ప్రభుత్వ పథకాల ప్రక్రియలు ఏమైనా ఇంకా పూర్తి కాకుండా ఉంటే ఈ నెల 10లోగా వాటిని పూర్తి చేయాలని ఆదేశించారు.

అనూహ్యంగా, హఠాత్తుగా ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించడం, దసరాకు ప్రారంభించాలనుకున్న సీఎం అల్పాహార పథకాన్ని ఈ నెల 6నే ప్రారంభించేందుకు నిర్ణయించడం ఇవన్నీ కూడా ఎన్నికల షెడ్యూల్ విడుదల వారంలోగానే ఉంటుందన్నడానికి సంకేతాలుగా చెబుతున్నారు. అన్నిటికీ మించి ప్రధాని నరేంద్ర మోడీ మూడు రోజుల వ్యవధిలో తెలంగాణలో రెండు సార్లు పర్యటించి రెండు బహిరంగ సభలలో ప్రసంగించారు. ఆయన ప్రసంగాలలో ఎన్నికల హామీలను గుప్పిస్తూనే అధికార పార్టీ అధినేతపై విమర్శలు గుప్పించారు. అలాగే కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్ కుమార్ సారథ్యంలో ఎన్నికల సంఘం బృందం తెలంగాణలో పర్యటిస్తున్నది. ఎన్నికల ఏర్పాట్లు, సన్నద్ధత తదితర అంశాలపై చర్చలు జరుపుతోంది. సమీక్షలు నిర్వహిస్తోంది. 

 తెలంగాణ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల ఎన్నికల గడువు 2014, జనవరి 24తో ముగియనుండగా, ఒక్క మిజోరంలో మాత్రం ఈ ఏడాది డిసెంబరు 17 వరకే ఉంది. అందుకే ఒకేసారి ఐదు రాష్ట్రాల ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తున్నది. జమిలి ప్రతిపాదన, ప్రస్తావన వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి లేదని తేలిపోవడంతో షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని నిర్ధారణ అయ్యిందని చెబుతున్నారు.