నల్గొండకు రాములు నాయక్,  హైద్రాబాద్ కు చిన్నారెడ్డి! 

తెలంగాణలో పట్టు కోసం కాంగ్రెస్ నేతలంతా ఏకమయ్యారు. త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను సవాల్ గా  తీసుకుని పని చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుతో కేడర్ లో జోష్ నింపి.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం దిశగా అడుగులు వేయాలని టీకాంగ్రెస్ నేతలు ప్రణాళికలు రచించారు. అందుకే రెండు ఎమ్మెల్సీ స్థానాలకు బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపుతున్నారు. సామాజిక సమీకరణలు, సమర్ధత ఆధారంగా ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులను కాంగ్రెస్ హైకమాండ్ దాదాపుగా ఖారారు చేసిందని చెబుతున్నారు. నల్లగొండ– ఖమ్మం– వరంగల్‌ జిల్లాల ఎమ్మెల్సీ నియోజకవర్గ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ ఎస్‌.రాములు నాయక్, రంగారెడ్డి– హైదరాబాద్‌– మహబూబ్‌నగర్‌ జిల్లాల నియోజకవర్గ అభ్యర్థిగా మాజీ మంత్రి జి.చిన్నారెడ్డిలను నిర్ణయించినట్టు సమాచారం. 
        
పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్లను కేటాయించేందుకు కాంగ్రెస్ పెద్ద కసరత్తే చేసింది.  రెండు నెలల క్రితమే ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. నల్లగొండ స్థానానికి 26, రంగారెడ్డికి 24 దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తులను వడపోసి.. సామాజిక సమీకరణాలు, అనుభవం అనే ప్రాతిపదికలను కాంగ్రెస్‌ పార్టీ ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. నల్లగొండ– ఖమ్మం–వరంగల్‌ ఎమ్మెల్సీ నియోజకవర్గ అభ్యర్థిగా రాములునాయక్‌ను ఇదే కోణంలో ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.  రాముల్ నాయక్ కు  ఎమ్మెల్సీగా రెండేళ్ల పదవీకాలం ఉండగానే అధికార టీఆర్‌ఎస్‌ను వీడి ఆయన కాంగ్రెస్‌ పార్టీలోకి వచ్చారు. కేసీఆర్ పై పోరాటం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో ముందు నుంచి ఉన్నారు రాములు నాయక్. టీఆర్ఎస్ స్థాపించిన సమయంలో కేసీఆర్ తో ఉన్న కొద్ది మంది నాయకుల్లో ఆయన ఒకరు. 


గిరిజన నేతగా, తెలంగాణ ఉద్యమకారునిగా గుర్తింపు ఉన్నప్పటికీ అటు అసెంబ్లీ, ఇటు పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఆయనకు పార్టీ ఇవ్వలేదు. అందుకే ఆయన టీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. రాములు నాయక్ కు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడం ద్వారా కాంగ్రెస్‌ పార్టీలో ఎప్పటికైనా భవిష్యత్తు ఉంటుందనే సంకేతాలు ఇచ్చినట్టు అవుతుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.  ఈ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో  లంబాడీ గ్రాడ్యుయేట్లు ఎక్కువగా ఉన్నారు. త్వరలో ఉపఎన్నిక జరగనున్న నాగార్జునసాగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఈ సామాజికవర్గం ఓట్లు గణనీయంగా ఉన్నాయి. రాములు నాయక్ ఎమ్మెల్సీ టికెట్ ఇస్తే.. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలోనూ కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తుందని చెబుతున్నారు. 

 రంగారెడ్డి– హైదరాబాద్‌– మహబూబ్‌నగర్‌ అభ్యర్థిగా జి.చిన్నారెడ్డిని అనుభవం ప్రాతిపదికన ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈసారి చిన్నారెడ్డికి అవకాశం ఇవ్వాలని టీపీసీసీ పెద్దలు ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ టికెట్‌ ఆశించిన మాజీ ఎమ్మెల్యేలు కూన శ్రీశైలం గౌడ్, టి.రామ్మోహన్‌ రెడ్డిలు పోటీ నుంచి తప్పుకోవడం, అధిష్టానం పరిశీలనలో ఉన్న వంశీ యువకుడు కావడంతో మరోమారు అవకాశం ఇవ్వవచ్చనే ఆలోచన మేరకు ఇక్కడి నుంచి చిన్నారెడ్డి పేరు దాదా పు ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.