కడుపులో లేని ప్రేమ కావలించుకొంటే వస్తుందా?

 

ఆంధ్రప్రజలపై, పాలకులపై, ప్రభుత్వంపై తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కున్న విద్వేషం గురించి తెలియనిది కాదు. కానీ ఆయన అప్పుడప్పుడు వారిపై కూడా అకారణంగా ప్రేమ ఒలకబోస్తూ ఆశ్చర్యపరుస్తుంటారు. నిన్న మీర్‌పేటలోని జరిగిన ఒక సభలో కేసీఆర్ మాట్లాడుతూ, “తెలంగాణా లో స్థిరపడ్డ ఆంధ్రావాళ్ళు అందరూ కూడా నా బిడ్డలే. వాళ్ళని కూడా కడుపులో పెట్టుకొని చూసుకొంటాము,” అని ఆయన అన్నారు.

 

ఇదే కేసీఆర్ కొన్ని రోజుల క్రితమే “ఆంధ్రా విద్యార్ధులకు మేమెందుకు ఫీజులు చెల్లించాలి? మా ప్రభుత్వం కేవలం తెలంగాణా విద్యార్ధులకు మాత్రమే ఫీజు రీ ఇంబర్స్ మెంటు చేస్తుంది. మీ పిల్లలకి మీరే చెల్లించుకోండి” అని తెగేసి చెప్పడమే కాకుండా అందుకోసం 1956సం.ని ప్రాతిపాదికగా ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. చివరికి తెలంగాణలో స్థిరపడిన ఆంధ్రా విద్యార్ధులకి బస్సు పాసులు ఇవ్వడానికి సైతం నిరాకరించారు. కానీ ఇప్పుడు హటాత్తుగా వారిపై ప్రేమ ఒలకబోయడానికి కారణం కూడా ఆయనే స్వయంగా బయటపెట్టుకొన్నారు. “తెలంగాణా అభివృద్ధికి అందరి సహకారం తీసుకొంటాము. ఆంద్ర ప్రాంత పారిశ్రామికవేత్తలకు కూడా మా ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరుస్తుంది,” అని అన్నారు. అంటే ఆయన ఆంధ్ర ప్రజలను, ప్రభుత్వాన్ని, పాలకులను ఒకపక్క ద్వేషిస్తూనే, తెలంగాణా అభివృద్ధికి ఆంద్ర పారిశ్రామిక వేత్తల సహకారం తీసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదని చెపుతున్నారన్న మాట.

 

కానీ ఒకప్పుడు హైదరాబాద్ నగరాన్ని రాష్ట్ర ప్రజలందరూ కలిసి అభివృద్ధి చేసారని, ఆంద్రప్రజలు వాదించినపుడు, ఇదే కేసీఆర్, “హైదరాబాద్ 1956నాటికే అన్ని విధాల అభివృద్ధి చెందింది. ఇందులో మీరు చేసింది ఏముంది?” అని ప్రశ్నించడం కూడా ప్రజలందరికీ తెలుసు.

 

ఇదే సభలో కేసీఆర్ మాట్లాడుతూ “హైదరాబాద్ ను తానే అభివృద్ధి చేసానని చంద్రబాబు నాయుడు పదేపదే చెప్పుకొంటున్నారు. కుతుబ్ షా కనుక బ్రతికి ఉండి ఉంటే, ఆయన మాటలు విని ఆత్మహత్య చేసుకొని ఉండేవారేమో?” అని ఎద్దేవా చేశారు. కుతుబ్ షా కాలంలోనే హైదరాబాద్ అభివృద్ధి చెంది ఉన్నప్పుడు, గత పాలకులు హైదరాబాద్ ని సరిగ్గా అభివృద్ధి చేయలేదని దుమ్మెత్తి పోయడం ఎందుకు? అప్పుడే అభివృద్ధి చెందిన నగరాన్ని మళ్ళీ ఇప్పుడు తను కూడా అభివృద్ధి చేస్తానని చెప్పడం ఎందుకు? హైదరాబాద్ ని చంద్రబాబే ప్రధానంగా అభివృద్ధి చేసిన సంగతి తెలిసినప్పటికీ ఆయనను ఎద్దేవా చేస్తున్న కేసీఆర్, రేపు తనే తెలంగాణాని అభివృద్ధి చేసానని చెప్పుకొన్నప్పుడు కూడా ప్రత్యర్ధులు ఇదేవిధంగా ఎద్దేవా చేసే అవకాశం ఉంటుందనే సంగతి కూడా గ్రహిస్తే మంచిది.

 

ఆంద్ర వలసవాదులు చాలా దుర్మార్గంగా పాలన చేసారని, హైదరాబాద్ కి ఆంధ్రా వాళ్ళు చేసింది ఏమీ లేదని ఒకవైపు దూషిస్తూనే, తెలంగాణా అభివృద్ధికి ఆంద్ర పారిశ్రామిక వేత్తల సహకారం అవసరమని చెప్పడం ఆయనకే చెల్లు. వారిని ఆకర్షించడానికే ఆయన తెలంగాణాలో స్థిరపడ్డ ఆంద్రప్రజల పట్ల లేని ప్రేమ ఒలకబోస్తున్నారు. ఒకప్పుడు హైదరాబాద్ మన అందరిదీ అనే భావనతోనే ఆంధ్రకు చెందిన పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, అక్కడ తమ పరిశ్రమలు, విద్యావైద్య సంస్థలు స్థాపించారు. కానీ కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణా ఉద్యమాలు మొదలయినప్పటి నుండి వారిలో ఒక అభద్రతా భావం మొదలయింది. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణా ముఖ్యమంత్రిగా అధికారం చేప్పట్టిన కేసీఆర్ వారిలో ఆ అభద్రతాభావం తొలగించే ప్రయత్నం చేయకపోగా దానిని తన మాటలతో మరింత పెంచి పోషిస్తూ వచ్చారు. నేటికీ ఆయన మాటలలో ఆంద్ర ప్రజలు, పాలకుల పట్ల ఏహ్యత, తృణీకార భావనలు ప్రస్పుటంగా కనబడుతూనే ఉన్నాయి. అటువంటప్పుడు మళ్ళీ ఆంధ్రా పారిశ్రామికవేత్తల సహాకారం కోరడంలో ఔచిత్యం ఏమిటో ఆయనకే తెలియాలి. కనుక ఇప్పుడు ఆయన ఆంద్ర ప్రజల పట్ల ఎంత ప్రేమ ఒలకబోసినా దానిని నమ్మేందుకు ఎవరూ సిద్దంగా లేరని చెప్పక తప్పదు.

 

బంగారి తెలంగాణా నిర్మిస్తానని పదేపదే చెపుతున్న కేసీఆర్ ముందుగా ప్రజలందరినీ కలుపుకు పోవడం నేర్చుకోవాలి. ఇరుగుపొరుగు రాష్ట్రాలతో, కేంద్రంతో సఖ్యతగా మెలగడం నేర్చుకోవలసి ఉంటుంది. ఇచ్చిపుచ్చుకొనే ధోరణి అలవరుచుకోవలసి ఉంటుంది. కానీ ఇవేవీ చేయకుండా ప్రతీ సభలో ప్రజలకు రంగుల కలలు చూపించినంత మాత్రాన్న అవన్నీ నెరవేరడం సాధ్యం కాదు.