రాజ్‌భవన్‌లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం
posted on Jun 8, 2025 1:09PM

తెలంగాణ మంత్రులుగా గడ్డం వివేక్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లు ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో నూతన మంత్రులతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. అనంతరం నూతన మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ జిష్ణుదేవ్ అభినందనలు తెలిపారు. ప్రస్తుత మంత్రివర్గంలో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు 12 మంది మంత్రులుగా కొనసాగుతున్నారు. మరో ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటిలో ఇవాళ ముగ్గురిని భర్తీ చేశారు.
మార్పు చేర్పులతో ఐదు బెర్తులు పూరించాలని తొలుత భావించినా, సామాజిక వర్గ సమీకరణాల నేపథ్యంలో ఇప్పుడు ముగ్గురి పేర్లకు ఆమోదం లభించినట్టు తెలిసింది. తాజా విస్తరణలో కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయాన్ని పరిగణనలోకి తీసుకున్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మాత్రమే అవకాశం కల్పించింది. కాగా, ఈసారి మంత్రివర్గ విస్తరణలో సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలకు చోటు దక్కుతుందని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతానికి ఎస్సీ, బీసీలకు మాత్రమే అవకాశం ఇవ్వాలని అధిష్టానం సూచించినట్లు తెలిసింది. కొత్త మంత్రులతో పాటు శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా రామచంద్రునాయకన్ ను కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది.