బడ్జెట్ పై ఆశలు పెంచుకుంటున్న తెలంగాణ ఎమ్మెల్యేలు... మరి కేసీఆర్ కరుణిస్తారో లేదో?

సాధారణంగా ప్రతి ఏటా ఆయా ప్రభుత్వాలు ప్రవేశపెట్టే బడ్జెట్లపై ప్రజలు ఆశతో ఎదురుచూస్తారు. తమకేదైనా మేలు జరిగేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందా? లేదా? అని ఆలోచిస్తారు. అయితే, విచిత్రంగా తెలంగాణలో బడ్జెట్‌ కోసం ఎమ్మెల్యేలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈసారి బడ్జెట్‌లో నియోజకవర్గాలకు స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ ఉంటుందా? లేదా? అంటూ ఎమ్మెల్యేలు ఎదురుచూపులు చూస్తున్నారు. 

2020-21 తెలంగాణ బడ్జెట్‌పై ప్రజల కంటే ముందుగా ఎమ్మెల్యేలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక, ఇప్పటివరకు నియోజకవర్గాలకు స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్‌ నిధులు కేటాయించకపోవడంతో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు నిరాశకు లోనవుతున్నారు. ఎస్డీఎఫ్ నిధులు ఇవ్వకపోవడంతో అభివృద్ధి పనులు చేయలేకపోతున్నామని అంటున్నారు. ప్రతి నియోజకవర్గానికి 3కోట్ల రూపాయలను కేటాయిస్తూ సీఎం కేసీఆర్ గతంలో నిర్ణయం తీసుకున్నారు. అయితే, 2019-20 నుంచి ఈ నిధుల విడుదలను ఆపేశారు. దాంతో, నియోజకవర్గాల్లో సమస్యల పరిష్కారం చేయలేకపోతున్నామని ఎమ్మెల్యేలు వాపోతున్నారు. 

అయితే, ఆర్ధిక మాంద్యం, కేంద్ర నిధుల్లో కోత, తగ్గిన రెవెన్యూ రాబడి కారణంగా తీవ్ర నిధుల కొరతను తెలంగాణ ఎదుర్కొంటోంది. దాంతో, గతేడాది బడ్జెట్‌లో నియోజకవర్గ అభివృద్ధి నిధులను నిలిపివేశారు. అయితే, గతేడాది ఎస్డీఎఫ్‌ నిధులను రద్దుచేసి ఎమ్మెల్యేలకు షాకిచ్చిన సీఎం కేసీఆర్‌.... ఈసారి ఖుషీ చేయబోతున్నారనే మాట వినిపిస్తోంది. ఈ బడ్జెట్‌లో ఎస్డీఎఫ్ పథకాన్ని పునరుద్ధరించి...ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఏటా కోటిన్నర చొప్పున నిధులు కేటాయించబోతున్నట్లు తెలుస్తోంది.