తెలంగాణా బిల్లుకి రెండు ప్రధాన అవరోధాలు

 

రాష్ట్ర విభజన అంశం తుది దశకు చేరుకోవడంతో, రాష్ట్ర రాజకీయ నేతలందరూ విభజనకు అనుకూలంగా, వ్యతిరేఖంగా ఎవరి ప్రయత్నాలు వారు మొదలు పెట్టడంతో, చివరికి ఇది ఏవిధంగా ముగుస్తుందనే ఉత్కంట ప్రజలందరిలో నెలకొంది. ఇప్పుడు రెండు ప్రధాన అంశాలు బిల్లు భవితవ్యం తేల్చనున్నాయి. మొదటిది బిల్లుకి న్యాయ, రాజ్యాంగపరమయిన చిక్కులు. రెండు పార్లమెంటులో బిల్లుకి మద్దతు కూడగట్టడం.

 

మొదటి సమస్యను కాంగ్రెస్ అధిష్టానంతో సహా అందరూ చాల తేలికగా కొట్టిపరేస్తున్నపటికీ, శాసనసభ చేత తిరస్కరించబడిన బిల్లుని ముందుకు తీసుకువెళ్ళడం కష్టమే. మొట్ట మొదట రాష్ట్రపతే దానిపై న్యాయ సలహా కోరవచ్చును. హోంశాఖ వివరణ కోరవచ్చును. అది సంతృప్తికరంగా లేకుంటే బిల్లుని త్రొక్కి పట్టవచ్చును లేదా బిల్లుపై వచ్చిన అభ్యంతరాలను సవరణలను అన్నిటినీ సరిచేయమని కేంద్రానికి త్రిప్పి పంపవచ్చును.

 

రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సహా అనేక మంది ప్రతిపక్ష నేతలు ఆయనను కలిసి బిల్లుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నపుడు, ఆయన వారి అభ్యంతరాలను పట్టించుకోకుండా లోపభూయిష్టమయిన బిల్లుపై ఆమోదముద్రవేసి కేంద్రానికి అందజేస్తారని భావించలేము. ఆయన ప్రతిస్పందన చూసిన తరువాత బిల్లుకి వ్యతిరేఖంగా సుప్రీంకోర్టులో పిటిషను వేస్తామని ఇప్పటికే తెదేపా నేత సుజన చౌదరి ప్రకటించారు. వారేగాకుండా ఇంకా లగడపాటి రాజగోపాల్ వంటి వారు అనేకమంది కోర్టులో పిటిషన్లు వేయవచ్చును. గతంలో వారు కోర్టులో పిటిషన్లు వేసినప్పుడు కేంద్రం అధికారికంగా రాష్ట్ర విభజన ప్రకటించినప్పుడు కోర్టుని ఆశ్రయించవచ్చని సూచించినందున ఇప్పుడు వారు వేసే పిటిషన్లను కోర్టు తప్పకుండా స్వీకరిస్తుంది. అంటే బిల్లుకి రాజ్యంగ, న్యాయపరమయిన అడ్డంకులు ఉన్నాయని స్పష్టమవుతోంది.

 

ఇక ఒకవేళ బిల్లు ఈ అడ్డంకులన్నిటినీ అధిగమించి పార్లమెంటుకి చేరుకోగలిగినట్లయితే, అమోదం పొందేందుకు బీజేపీ, ప్రతిపక్షాల మద్దతు అవసరం ఉంటుంది. ప్రస్తుతం పార్లమెంటులో వివిధ పార్టీల బలాబలాలు ఈవిధంగా ఉన్నాయి.

 

లోక్ సభ మొత్తం సభ్యుల సంఖ్య:533, కాంగ్రెస్ మిత్ర పక్షాల సంఖ్య:247. లోక్ సభలో బిల్లు అమోదంపొందానికి అవసరమయిన కనీస సభ్యుల సంఖ్య:267. అంటే లోక్ సభలో బిల్లు ఆమోదం పొందేందుకు మరో 20మంది ఇతర పార్టీల సభ్యుల మద్దతు అవసరం ఉంటుందన్నమాట. శివసేన (11), తృణమూల్ కాంగ్రెస్ (19), సమాజ్ వాది పార్టీ (22) బిల్లుకి మద్దతు ఈయబోమని స్పష్టం చేసాయి.

 

వీరిలో సమాజ్ వాదీ పార్టీ కాంగ్రెస్ కూటమికి బయట నుండి మద్దతు ఇస్తోంది గనుక, ఆమేర అంటే 22 సభ్యుల మద్దతు తగ్గినట్లు భావించవచ్చును. అయితే సమాజ్ వాది పార్టీ కాంగ్రెస్ ప్రతిపాదించిన అనేక బిల్లులను కూడా గతంలో తీవ్రంగా వ్యతిరేఖించి, ఆఖరి నిమిషంలో మద్దతు ఈయడమో లేదా వాకవుట్ చేసి దానికి సహకరించడమో చేసింది. గనుక ఆ పార్టీ మాటలను విశ్వసించడం కష్టం.

 

ఇక కాంగ్రెస్ కు బయట నుండి మద్దతు ఇస్తున్న బీ.యస్.పీ. (21) చిన్న రాష్ట్రాలను కోరుకొంటోంది గనుక బిల్లుకి మద్దతు ఈయవచ్చును. ఒకప్పటి కాంగ్రెస్ మిత్రపక్షమయిన డీ.యం.కే. త్వరలో యూపీయే కూటమికి గుడ్ బై చెప్పలనుకొంటున్న నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు బిల్లుకి మద్దతు ఇస్తాయో లేదో చివరి నిమిషం వరకు అనుమానమే. ఇక జయలలిత అధ్వర్యంలో నడుస్తున్న ఏ.ఐ.ఏడీ.యం.కే. (9) తమిళనాడులో ప్రత్యేక రాష్ట్రాల కోసం వస్తున్నడిమాండ్స్ ను నిర్ద్వందంగా తిరస్కరిస్తోంది గనుక, బిల్లుకి మద్దతు ఈయకపోవచ్చును. అయితే, లోక్ సభలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మద్దతుతో కాంగ్రెస్ అధిష్టానం బిల్లుని ఏదోవిధంగా ఆమోదింపజేయగలదు. కానీ రాజ్యసభలో మాత్రం కష్టమవుతుంది.

 

ప్రస్తుతం రాజ్యసభ సభ్యుల సంఖ్య: 242. కాంగ్రెస్:72; బీజేపీ: 47. బిల్లు ఆమోదం పొందాలంటే కనీసం 121 మంది సభ్యుల మద్దతు అవసరం. అంటే కాంగ్రెస్ పార్టీకి మరో 49 మంది సభ్యుల మద్దతు ఆవసరం. అంటే బీజేపీ మద్దతు తప్పనిసరి అన్నమాట. అందుకే బీజేపీ బిల్లుకి మద్దతు ఇచ్చే విషయంలో రకరకాలుగా మాట్లాడుతోంది. రాజ్యసభలో మిగిలిన 123 సభ్యులలో కాంగ్రెస్ పార్టీ మరో 49 మంది మద్దతు కూడా గట్టగలిగితేనే  అక్కడ కూడా బిల్లు ఆమోదం పొందగలదు. కానీ,ఇతర పార్టీ సభ్యుల మద్దతు కూడా గట్టలేకనే బీజేపీ మద్దతు గురించి కాంగ్రెస్ పదేపదే మాట్లాడుతోందని గనుక రాజ్యసభలో బిల్లు ఆమోదం దాదాపు అసాధ్యమేనని స్పష్టమవుతోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu