గందరగోళ సమావేశాలు...
posted on Mar 10, 2015 10:51AM

తెలంగాణ శాసనసభ సమావేశాలు రెండోరోజు కూడా చాలా వాడివేడిగా ప్రారంభమయ్యాయి. మంగళవారం కూడా సభ అలా మొదలయ్యిందో లేదో 15 నిమిషాలు వాయిదా పడింది. ఇవి అసెంబ్లీ సమావేశాల్లా కాకుండా గందరగోళ సమావేశాలుగా తయారయ్యాయి. సభలో చర్చలు కంటే ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం ఎక్కువైంది. సభలో అధికార పార్టీ తమ జులుంను బాగానే చూపిస్తుంది. దీనికి ఉదాహరణగా సోమవారం జరిగిన శాసనసభా సమావేశాల్లో పదిమంది టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెన్షన్ గురికావడం చెప్పుకోవచ్చు. సభా కార్యక్రమాలకు అడ్డుతగులుతున్న టీడీపీ ఎమ్మెల్యేలను సమావేశాలు ముగిసే వరకూ సస్పెండ్ చేయాలని శాసనసభ వ్యవహారాల మంత్రి హరీశ్‌రావు ప్రతిపాదించడం, తీర్మానాన్ని సభ ఆమోదించడం క్షణాల్లో జరిగిపోయింది. మాల, మాదిగ, మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేయగా, మంత్రి హరీశ్‌రావు కల్పించుకుని.. జాతీయ గీతాన్ని అవమానించిన సభ్యులు భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో పది మంది సస్పెన్షన్ కోరుతున్నట్లు మంత్రి ప్రతిపాదించారు.