బీజేపీ, టీఆర్ఎస్ వాగ్వాదం
posted on Nov 15, 2014 1:27PM

తెలంగాణ రాష్ట్ర శాసనసభలో బీజేపీ, టీఆర్ఎస్ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. శనివారం నాడు ప్రశ్నోత్తరాల అంశం ముగియగానే జీరో అవర్‌లో బీజేపీ, టీఆర్ఎస్ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బీజేపీ శాసనసభ పక్ష నాయకుడు డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ, తెలుగుదేశం సభ్యుల మీద సస్పెన్షన్ ఎత్తివేసే అంశాన్ని పరిశీలించాలని స్పీకర్‌కి విజ్ఞప్తి చేశారు. అయితే ఈ విజ్ఞప్తిని టీఆర్ఎస్ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి హరీష్ రావు టీడీపీ సభ్యుడు రేవంత్ రెడ్డి క్షమాపణలు చెబితే సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు. దానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందిస్తూ, రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు శాసనసభ సభ్యులను కించపరిచేలా లేవని, అసలు టీడీపీ సభ్యులను ఏ అంశం మీద సస్పెండ్ చేశారో స్పష్టం చేయాలని అన్నారు. ఇదిలా వుండగా శాసనసభ సమావేశాలు సోమవారానికి వాయిదా పడగా, శాసనమండలి సమావేశాలు 21వ తేదీకి వాయిదా పడ్డాయి.