కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎమ్మెల్యే కూనంనేని సంచలన వ్యాఖ్యలు

 

తెలంగాణలో గత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే  కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ఈ ప్రాజెక్టు కోసం ఇకపై ప్రజాధనాన్ని వెచ్చించవద్దని ఆయన ప్రభుత్వానికి సూచించారు. హైదరాబాద్‌లో ఈ రోజు ఉదయం కూనంనేని మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అన్నీ తానై వ్యవహరించిన కేసీఆర్, ఇప్పుడు మాత్రం ప్రాజెక్టుతో తనకు ఎలాంటి సంబంధం లేనట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ ప్రాజెక్టుతో రాష్ట్రంలో అదనంగా ఒక్క ఎకరాకు కూడా సాగునీరు అందలేదని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం పంటలకు అందుతున్న నీరంతా ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారానే వస్తోందని స్పష్టం చేశారు. 

కాళేశ్వరం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, ఇది పూర్తిగా నిరుపయోగమైన ప్రాజెక్టు అని కూనంనేని అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వంపైనా కూనంనేని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్డీయే సర్కార్ మానవ హక్కులను ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. మావోయిస్టుల మృతదేహాలను చూసి కూడా కేంద్రంలోని పెద్దలు భయపడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మావోయిస్టు నేత కేశవరావు మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించకపోవడం అత్యంత దారుణమని కూనంనేని అన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఆయన తీవ్రంగా ఖండించారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu