చంద్రబాబు నోటి మాటగా సాధించుకొచ్చిన దానికి...

 

తెలంగాణా శాసనసభ విద్యుత్ పై సోమవారం ఒక తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించింది. అందులో ఆంధ్రానుండి రాష్ట్రానికి రావలసిన వాటాను ఇప్పించే బాధ్యత కేంద్రమే తీసుకోవాలని, ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించినట్లే తెలంగాణా రాష్ట్రానికి కూడా నిరంతరాయ విద్యుత్ సరఫరా పైలట్ ప్రాజెక్టు ఒకటి మంజూరు చేయాలని తీర్మానం చేసారు. అయితే అసలు శాసనసభలో ఈ తీర్మానం చేయవలసిన అవసరం ఏమొచ్చింది? అని ఆలోచిస్తే తెలంగాణా ప్రభుత్వం మొదటి నుండి కూడా కేంద్రంతో ఘర్షణ వైఖరి అవలంభించడం వలన, నేరుగా అడిగినట్లయితే దాని సహాయం దొరకకపోవచ్చనే అనుమానంతోనే ఈ ఆలోచన చేసినట్లు అర్ధమవుతుంది.

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ లో తమకు న్యాయంగా ఈయవలసిన వాటా ఈయడంలేదు కనుక కేంద్రం జోక్యం చేసుకొని ఇప్పించాలని తీర్మానంలో కోరుతున్నారు. కానీ అంతకంటే ముందుగా తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కూర్చొని ఈ సమస్య పరిష్కారం కోసం ఒక్కసారయినా మాట్లాడి విఫలమయ్యి ఉంటే, అప్పుడు న్యాయం చెప్పమని కేంద్రం వద్దకు వెళ్ళినా అర్ధం ఉండేది. ఇద్దరం కూర్చొని సమస్యలను చర్చించుకొని పరిష్కరించుకొందామని చంద్రబాబు నాయుడు పదేపదే చెప్పినా, 300మెగావాట్స్ విద్యుత్ ఇస్తామని చెప్పినా కేసీఆర్ పట్టించుకోలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ తనకు సహకరించడం లేదని ఆరోపిస్తూ ఇప్పుడు కేంద్రానికి ఈ తీర్మానం రూపంలో పిర్యాదు చేయాలని ప్రయత్నిస్తున్నారు. అందుకు తను నిత్యం దూషించే ప్రతిపక్షాల మద్దతు కూడా కోరడం కేసీఆర్ కే చెల్లు.

 

ఇక తీర్మానంలో రెండో అంశం పైలట్ ప్రాజెక్టు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చంద్రబాబు నాయుడు ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ పైలట్ ప్రాజెక్టు సాధించుకోవడానికి ఎటువంటి తీర్మానాలు చేసి పట్టుకొని వెళ్లి అడగలేదు. కేవలం నోటిమాటగా అడిగి తెచ్చుకోగలిగారు.కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి చేప్పట్టక ముందు నుండే కేంద్ర మంత్రులందరినీ ప్రసన్నం చేసుకోవడంతో ఆయన ప్రమాణ స్వీకారం నాడే కేంద్ర విద్యుత్ శాఖమంత్రి పీయూష్ గోయల్ రాష్ట్రానికి నిరంతరాయ విద్యుత్ పైలట్ ప్రాజెక్టు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. చంద్రబాబు నోటిమాటగా సాధించుకొచ్చిన దానికోసం కేసీఆర్ శాసనసభ చేత తీర్మానం చేయించవలసి వచ్చిందంటేనే ఆయన తన వైఫల్యాన్ని స్వయంగా దృవీకరిస్తున్నట్లయింది.

 

కొత్త రాష్ట్రానికి మొట్టమొదటి సారిగా ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ తన ప్రజల దృష్టిలో గొప్ప హీరోగా కనబడాలనే తాపత్రయంతో అధికారం చేప్పట్టిన మొదటి రోజు నుండే కేంద్రంతో కూడా యుద్ధం మొదలు పెట్టేసారు. ‘కేసీఆర్ ఎవరికీ భయపడడు’ అని ప్రజలు తన గురించి గొప్పగా చెప్పుకోవాలనే ఆవిధంగా చేసారేమో? కానీ దాని వలన తెలంగాణా రాష్ట్రానికి ఒరిగిందేమీ లేకపోయినా నేడు విద్యుత్, పైలట్ ప్రాజెక్టు కోసం కూడా ఒక తీర్మానం చేయవలసిన దుస్థితి ఏర్పడింది.

 

ఇక్కడ శాసనసభలో విద్యుత్ సంక్షోభంపై వాదోపవాదాలు,తీర్మానాలు జరుగుతున్న సమయంలోనే చంద్రబాబు బెంగుళూరు వెళ్లి కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యని కలిసి తుంగభద్రా నదీ జలాల పంపకాలు, దాని సమస్యలపై చర్చించి వచ్చారు. కాంగ్రెస్, తెదేపాలకు చెందిన వారిరువురూ పార్టీల పరంగా శత్రువులు అయినప్పటికీ వారి చర్చలు చాలా సానుకూల వాతావరణంలో జరగడం, చంద్రబాబుకి కర్నాటక ముఖ్యమంత్రి శాలువా కప్పి గౌరవించడం గమనార్హం. వీటన్నిటి బట్టి అర్ధమవుతున్న సంగతి ఏమిటంటే నోరు మంచిదయితే ఊరు కూడా మంచిదవుతుందని. అందరితో సఖ్యతగా ఉన్నట్లయితే ఏ తీర్మానాలు అవసరం ఉండవని.