త్వరలో ఆంద్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా?

 

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించక ముందు నుండే రాష్ట్రానికి రావలసిన నిధులు, ప్రాజెక్టుల కోసం కేంద్రం ఒత్తిడి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఐదు నెలలలో ఆయన అనేక సార్లు డిల్లీ వెళ్లి కేంద్రమంత్రులను కలిసి నిధుల విడుదల, పెండింగ్ ప్రాజెక్టుల క్లియరెన్స్ కోసం వారిపై ఒత్తిడి తెస్తున్నారు. నాలుగు రోజుల క్రితం ఆయన మళ్ళీ మరోమారు డిల్లీ వెళ్లి ఇదేపనిపై కేంద్రమంత్రులతో మాట్లాడారు. ఆ తరువాతే కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ రెండు వారాలలోగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంపై తుది నిర్ణయం తీసుకొంటామని హామీ ఇచ్చారు.

 

ఈరోజు కేంద్రవాణిజ్య శాఖామంత్రి నిర్మలా సీతారామన్, ఆర్ధిక, వాణిజ్య, రెవెన్యూ తదితర శాఖలకు చెందిన ముఖ్య కార్యదర్శులతో డిల్లీలో సమావేశం అవుతున్నారు. ఈ సమావేశానికి కేంద్రమంత్రులు అశోక్ గజపతి రాజు మరియు సుజనాచౌదరి కూడా హాజరవుతున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంపై ఒక నిర్ణయం తీసుకొనే అవకాశమున్నట్లు తెలుస్తోంది. తరువాత ఆర్ధిక, పారిశ్రామిక, విద్యుత్ తదితర శాఖల మంత్రులు కూడా క్లియరెన్స్ ఇచ్చినట్లయితే, ప్రధాని నరేంద్రమోడీ తన పదిరోజుల విదేశీపర్యటన ముగించుకొని డిల్లీకి తిరిగిరాగానే దీనిపై ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది.

 

ఈ రోజు వాణిజ్యమంత్రి నిర్మలా సీతారామన్ నిర్వహిస్తున్న సమావేశంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయమై సానుకూలంగా ఒక నిర్ణయం తీసుకొని అధికారికంగా ప్రకటన చేసినట్లయితే, ప్రస్తుతం సింగపూరులో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దానిని ఉపయోగించుకొని, రాష్ట్రానికి భారీ పెట్టుబడులు ఆకర్షించగలుగుతారు. అదేవిధంగా ఇంతవరకు ఈ ప్రత్యేక హోదా ప్రకటన కోసం వేచి చూస్తున్న పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు కూడా ఇకపై రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు, పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు రావచ్చును. ఒకవేళ ఈ నెలాఖరులోగా కేంద్రం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చినట్లయితే, బహుశః వచ్చే ఏడాది నుండి రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు, ఐటీ సంస్థలు ఏర్పాటయ్యే అవకాశాలున్నాయి. దానితో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిలో గణనీయమయిన మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. దాని వలన రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కూడా జోరందుకోవచ్చును.

 

ముఖ్యంగా రాష్ట్రంలో నిర్మించ తలబెట్టిన మూడు మెట్రో రైల్ ప్రాజెక్టులు, విభజన చట్టంలో హామీ ఇచ్చిన విధంగా వైజాగ్ నుండి చెన్నై వరకు పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు, ఉన్నత వైద్య, విద్యా సంస్థల ఏర్పాటు జరిగేందుకు కూడా ఇది దోహదపడవచ్చును. కనుక కేంద్రం కూడా సానుకూలంగానే నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని భావించవచ్చును.