హాఫ్ సెంచ‌రీ కొట్టి.. మ్యాచ్ ఓడి.. బీసీసీఐకి కోహ్లీ ఫీవ‌ర్‌!?

విరాట్ కోహ్లీని వ‌న్డే కెప్టెన్సీ నుంచీ స‌డెన్‌గా తీసేశారు. ముందుగా చెప్పకుండా అవ‌మానించారు. టీ20 కెప్టెన్సీ వ‌దులుకున్నందుకే.. వ‌న్డే నాయ‌క‌త్వం నుంచి త‌ప్పించార‌ని అంతా అనుకున్నారు. అందుకే, టెస్ట్ కెప్టెన్సీ నుంచి వైదొలిగి టిట్ ఫ‌ర్ టాట్‌గా కౌంట‌ర్ ఇచ్చారు కోహ్లీ. ఆ వెంట‌నే స‌ఫారీల‌తో వ‌న్డే సిరీస్ వ‌చ్చింది. కోహ్లీపై కెప్టెన్సీ నుంచి వైదొలిగిన ప్రెజ‌ర్ ఉంటుంద‌నుకున్నారంతా. కానీ, విరాట్ స్వేచ్ఛ‌గా ఆడేశాడు. బీసీసీఐకి త‌న స‌త్తా ఏంటో మ‌రోసారి చూపించాడు. ఏ ఫార్మాట్ కెప్టెన్సీ నుంచైతే త‌న‌ను అర్థాంత‌రంగా తొల‌గించారో.. ఇప్పుడు అదే ఫార్మాట్‌లో హాఫ్ సెంచ‌రీ కొట్టేసి స‌వాల్ విసిరాడు. అయినా, మ్యాచ్ ఓడిపోవ‌డంతో కోహ్లీ కెప్టెన్‌గా ఉండిఉంటే..? అనే టాక్ వ‌స్తోంది. 

సౌత్ ఆఫ్రికాతో టెస్టు సిరీస్‌ను కోల్పోయిన టీమ్‌ఇండియా.. మూడు వన్డేల సిరీస్‌నూ ఓట‌మితోనే ఆరంభించింది. తొలి వన్డేలో భారత్‌పై దక్షిణాఫ్రికా 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్‌ నెగ్గి తొలుత బ్యాటింగ్‌ చేసిన ప్రొటీస్‌ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్‌ ఎనిమిది వికెట్ల నష్టానికి 265 పరుగులు మాత్రమే చేయగలిగింది. శిఖర్‌ ధావన్‌ (79), విరాట్ కోహ్లీ (51), శార్దూల్‌ (50*) మినహా ఎవరూ పెద్దగా రాణించకపోవడంతో ఓటమి తప్పలేదు. కేఎల్‌ రాహుల్ 12, రిషభ్‌ పంత్ 16, శ్రేయస్‌ అయ్యర్ 17, వెంకటేశ్ అయ్యర్ 2, భువనేశ్వర్‌ 4, బుమ్రా 14* పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో షంసి 2, ఎంగిడి 2, పెహ్లుక్వాయో 2.. కేశవ్‌ మహరాజ్‌, మార్‌క్రమ్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.  

తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా.. 19 పరుగులకే ఓపెనర్ మలన్ (6) వికెట్ కోల్పోయింది. కెప్టెన్‌ బవుమా (110)తో కలిసి డికాక్ (27) ఇన్నింగ్స్‌ నడిపించాడు. డికాక్‌ ఔటైన తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన మార్‌క్రమ్ (4) వెంటనే పెవిలియన్‌కు చేరాడు. డస్సెన్ (129*)తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు బ‌వుమా. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 204 పరుగులు జోడించి భారత్‌కు బిగ్ టార్గెట్ ఇచ్చారు. బవుమా ఔటైనా.. ఆఖర్లో డస్సెన్‌ వేగంగా ఆడేశాడు. టీమ్‌ఇండియా బౌలర్లలో బుమ్రా 2, అశ్విన్‌ ఒక వికెట్‌ తీశారు.