సానియా మిర్జా సంచలన ప్రకటన..

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సంచలన నిర్ణయం ప్రకటించింది. వచ్చే సీజన్ నుంచి టెన్నిస్ ఆడబోనంటూ రిటైర్మెంట్ ప్రకటించింది. సానియా మీర్జా 68వ ర్యాంకులో కొనసాగుతోంది. మూడు సార్లు మహిళల డబుల్స్ టైటిల్స్, మిక్స్ డ్ డబుల్స్ గ్రాండ్ స్లామ్ విజేతగా సానియా నిలిచింది. నిజానికి భారత టెన్నిస్ క్రీడను సానియా మీర్జా అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లింది. దాంతో పాటుగా భారత టెన్నిస్ కు గ్లామర్ ను కూడా తీసుకొచ్చింది. టెన్నిస్ లో మన దేశానికి మరెవరూ సాధించలేని విజయాలు, కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చింది.

ప్రస్తుతం ఆస్ట్రేలియా ఓపెన్ డబుల్స్ తొలి రౌండ్ లోనే సానియా మీర్జా ఓటమిని చవిచూసింది. మహిళల డబుల్స్ లో ఉక్రెయిన్ క్రీడాకారిణి నదియా కిచెనోక్ తో కలిసి ఆస్ట్రేలియా ఓపెన్ లో పాల్గొన్న సానియా మీర్జా తొలి రౌండ్ లోనే ఓటమి పాలైంది. అనంతరం తన కెరీర్ కు గుడ్ బై చెబుతానని ప్రకటించింది. రిటైర్మెంట్ నిర్ణయం వెనుక పలు కారణాలు ఉన్నాయని తెలిపింది.  పోటీల్లో పాల్గొనేందుకు తన మూడేళ్ల కుమారుడితో కలిసి సుదీర్ఘ ప్రయాణాలు చేయాల్సి వస్తోందని, అలా తన ముద్దుల కొడుకును ఇబ్బంది పెట్టలేనని సానియా వివరించింది. దాంతో పాటుగా పోటీలకు తన శరీరం కూడా ఇంతకు ముందు మాదిరిగా సహకరించడం లేదని తెలిపింది. తన మోకాలు, మోచేయి ఇబబ్ంది పెడుతున్నాయని, అలా అని ఆస్ట్రేలియా ఓపెన్ లో ఓటమికి అదే కారణం అని కూడా చెప్పడంలేదని వివరించింది.  నిజానికి తాను గత సంవత్సరమే ఈ నిర్ణయంతీసుకున్నానని తెలిపింది. తనకు ఇప్పుడు 35 ఏళ్లు అని, శారీరక ఇబ్బందుల నుంచి కోలుకోవడానికి చాలా టైం పడుతోందని పేర్కొంది. ప్రస్తుత సీజన్ తుది వరకు ఆడాలనుకుంటున్నానని తెలిపింది. ఈ సీజన్ అనంతరం క్రీడలో కొనసాగేందుకు తన శరీరం సహకరిస్తుందని భావించడంలేదని చెప్పింది.

తన శరీరంలో శక్తి ఎప్పుడూ ఒకేలా ఉండదని తెలిపింది సానియా. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మళ్లీ ఫిట్ నెట్ సాధించేందుకు శారీరకంగా చాలా కష్టపడాల్సి వచ్చిందని సానియా వెల్లడించింది. బరువు తగ్గించుకునేందుకు, మునుపటి ఫిట్ నెస్ సాధించేందుకు ఎంతగానో కృషిచేయాల్సి వచ్చినట్లు వివరించింది. తనకు తానే మోటివేషన్ చేసుకున్నట్లు పేర్కొంది సానియా. మొత్తం మీద భారత టెన్నిస్ లో సంచలనాలు సృష్టించడమే కాకుండా.. గ్లామర్ తీసుకొచ్చి, ఎందరో యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచిన సానియా మీర్జా టెన్నిస్ కు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించి క్రీడా ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచింది.