నందమూరి వంశంలో పుట్టలేదా?.. పౌరుషం ఏమైంది?...

జూనియర్‌ ఎన్టీఆర్‌పై టీడీపీ నేతలు, శ్రేణులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఏపీ అసెంబ్లీలో వైసీపీ నేతలు నారా భువనేశ్వరిని ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఇలాగేనా స్పందించేది అని దుమ్మెత్తిపోస్తున్నారు. మీ మేనత్త భువనేశ్వరి వ్యక్తిత్వాన్ని కించపరిస్తే స్పందించే తీరు ఇదేనా అంటూ నిప్పులు చెరుగుతున్నారు.

భువనేశ్వరిని అనకూడని మాటలు అని మానసిక క్షోభకు గురిచేస్తే.. ఆమె భర్త, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కన్నీరు మున్నీరుగా విలపిస్తే జూనియర్ ఎన్టీఆర్‌కు చీమైనా కుట్టలేదా? అని ప్రశ్నిస్తున్నారు. నందమూరి వంశంలో జూనియర్‌ పుట్టలేదా? అని నిలదీస్తున్నారు. నందమూరి తారక రామారావు పేరు వాడుకుంటూ, ఆయన వారసత్వాన్ని అనుభిస్తూ.. ఆయన కుమార్తెను కించపరిస్తే నీకు ఎందుకు పౌరుషం రాలేదని ప్రశ్నిస్తున్నారు. మీ మేనత్తను అవమానించిన వారిపై స్పందించే తీరిదేనా అని తూర్పారపడుతున్నారు.

అసలు గుడివాడలో, గన్నవరంలో నీ మిత్రులకు టీడీపీ టిక్కెట్లు ఇప్పించుకోడానికి చంద్రబాబును జూనియర్‌ ఎన్టీఆర్‌ ఎంతలా పీడించిందీ ఆ పార్టీ శ్రేణులు గుర్తుచేసుకుంటున్నారు. నిజానికి టీడీపీని వాడేసుకుంటున్నదే జూనియర్ ఎన్టీర్‌ అని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు జూనియర్ ఎన్టీఆరే కొందరి చేత మేనత్తను, మేనమామను వెనక ఉండి మరీ తిట్టిస్తున్నారనే అనుమానాలు టీడీపీ కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు.

అసెంబ్లీలో తన మేనత్తపై అనుచిత వ్యాఖ్యలు చేసి ఇంత సమయం గడిచే వరకు జూనియర్ ఎన్టీఆర్ స్పందించకుండా జాప్యం చేయడం పైనా టీడీపీ శ్రేణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏపీ అసెంబ్లీలో శుక్రవారం జరిగిన సంఘటనపై అన్ని వర్గాల వారు, ఆడపడుచులు తీవ్రంగా స్పందిస్తుంటే జూనియర్ ఎన్టీఆర్‌ మాత్రం ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు ఉండాల్సి వచ్చిందని నిలదీస్తున్నారు. వైసీపీ నేతల అనుచిత వ్యాఖ్యలపై నందమూరి కుటుంబంలోని ప్రతి ఒక్కరూ స్పందించినా మీరెందుకు బయటికి రాలేదంటున్నారు. నందమూరి ఫ్యామిలోని ఏనాడూ మీడియాలోకి రాని వ్యక్తులు కూడా తమ ఇంటి ఆడబిడ్డకు జరిగిన అవమానంపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తుంటే.. మీరు తక్షణమే స్పందించకపోవడానికి కారణం ఏమిటని అడుగుతున్నారు. చివరికి తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా వైసీపీ నేతలు చేసింది తప్పు అని డైరెక్ట్‌గా ఖండించారు కదా.. మీకేమొచ్చిందని ప్రశ్నిస్తున్నారు.

కర్ర విరగకుండా.. పాము చావకుండా అన్న చందంలో జూనియర్ ఎన్టీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా ఎందుకు వీడియో విడుదల చేయాల్సి వచ్చిందని టీడీపీ శ్రేణులు, నేతలు నిలదీస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu