అడ్డుకున్నదీ మీరే..దీక్షలు చేస్తున్నదీ మీరే..

 

బీజేపీ నేతలపై ఎంపీ కేశినేని నాని మండిపడ్డారు.ఏపీలోకి రాకుండా బీజేపీ నేతలను తరిమికొడతామని హెచ్చరించారు.బీజేపీ రాష్ట్ర ప్రజలను తప్పుదోవపట్టించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. సీఎం చంద్రబాబు అంటే బీజేపీకి భయమని ఎద్దేవాచేశారు. అగ్రిగోల్డ్‌ స్కాం టీడీపీ హయాంలో జరగలేదని, అయినా బాధితులను ఆదుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు.అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ విజయవాడలో బీజేపీ ధర్మపోరాట దీక్ష చేపట్టింది. ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ చంద్రబాబుని, టీడీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు.దీనిపై స్పందించిన నాని అగ్రిగోల్డ్‌ బాధితులకు భాజపా నేతలు న్యాయం చేస్తాననటం విడ్డూరంగా ఉందన్నారు.

జీవీఎల్‌ నరసింహరావు, కన్నా లక్ష్మీనారాయణకు చిత్తశుద్ధి ఉంటే విభజన హామీలు అమలయ్యేలా కృషి చేయాలని డిమాండ్ చేశారు.విభజన హామీల విషయంలో ఆంధ్రులకు ఏం న్యాయం చేశారో, 18 విభజన హామీలను ఎందుకు పరిష్కరించలేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు. తిత్లీ తుపానుతో శ్రీకాకుళం జిల్లా ప్రజలు అల్లాడుతుంటే కనీసం భాజపా నేతలు ఆ వైపు కూడా చూడలేదని విమర్శించారు. తుపాను సాయంపై ప్రభుత్వం లేఖలు రాస్తే కనీసం స్పందన లేదని మండిపడ్డారు.ఇప్పుడు అగ్రిగోల్డ్‌ బాధితులపై మాట్లాడితే ప్రజలు నమ్మే స్థితిలో లేరని స్పష్టంచేశారు.ఎస్సెల్ గ్రూప్ ను ఢిల్లీకి పిలిపించుకుని అగ్రిగోల్డ్‌ను కొనడానికి వీల్లేదని బెదిరించి వెనక్కి పంపింది అమిత్ షా కాదా? అని ప్రశ్నించారు.

నీతి, నిజాయితీ గురించి మాట్లాడే అర్హత బీజేపీ నేతలకు లేదని, అవినీతిలో టాప్‌లో గుజరాత్‌ ఉంటే.. చివర్లో ఏపీ ఉందన్నారు.విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీని దేశం దాటించింది భాజపా కాదా? అని నిలదీశారు. అవినీతిపరులతో భాజపా చేతులు కలుపుతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. జగన్‌తో చేతులు కలిపి రాబోయే ప్రభుత్వం తమదేనన్న భ్రమలో భాజపా ఉందన్నారు.బీజేపీతోనే తాము అధికారంలోకి రాలేదని,పొత్తు వల్ల టీడీపీకి నష్టం జరిగిందన్ననాని పొత్తు లేకపోతే 130 అసెంబ్లీ స్థానాలు, 21 ఎంపీ సీట్లు వచ్చేవన్నారు.