వైసీపీకి బిగ్ షాక్.. కొండపల్లి నగర పంచాయతీ టీడీపీదే!
posted on Nov 18, 2021 2:47PM
కృష్ణా జిల్లా కొండపల్లి నగర పంచాయితీ ఎన్నికల్లో ఆసక్తికర ఫలితాలు వచ్చాయి. తుది ఫలితాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. కొండపల్లి నగర పంచాయితీలో 29 వార్డులు ఉండగా.. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలకు చెరో 14 వార్డులు దక్కాయి. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచారు. ఈ నగర పంచాయతీలో మ్యాజిక్ ఫిగర్ 15కాగా ఎవరూ దానిని చేరుకోలేదు.దాంతో ఇండిపెండెంట్‌గా 10వ వార్డు నుంచి గెలిచిన అభ్యర్థి ఎవరికి మద్ధతిస్తారన్నది ఆసక్తిగా మారింది. దాంతో చైర్మన్ సీటు కోసం ఇక్కడ ఇరు పార్టీలు ప్రయత్నించే అవకాశం కనిపిస్తోంది.
కొండపల్లిలో అధికార పార్టీతో హోరాహోరీగా పోరాడిన తెలుగు దేశం పార్టీ.. ఫలితాలు వచ్చిన వెంటనే చక్రం తిప్పింది. 10 వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన లక్ష్మిని తమవైపునకు తిప్పుకుంది. కృష్ణా జిల్లా నేతలు చంద్రబాబు సమక్షంలో కొండపల్లి ఇండిపెండెంట్ కౌన్సిలర్ శ్రీ లక్ష్మి టీడీపీలో చేర్చారు. ఇండిపెండెంట్ కౌన్సిలర్ టీడీపీ కండువా కప్పుకోవడంతో టీడీపీ బలం 15కు చేరగా.. వైసీపీ బలం 14గా ఉంది. వైసీపీకి ఎక్స్ అఫిషియోగా ఎమ్మెల్యే ఓటు ఉండటంతో ఇరు పార్టీల బలాబలాలు సమానమయ్యాయి. అయితే ఎంపీ కేశినేని నాని కూడా ఎక్స్‌అఫీషియో మెంబర్ హోదాలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు, దీంతో తో కొండపల్లిలో టీడీపీ బలం 16కు పెరగనుంది. నగర పంచాయితీపై టీడీపీ జెండా ఎగరనుంది.