కేటీఆర్‌, హరీశ్‌పై తెదేపా ఫిర్యాదు

 

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు సమీపిస్తున్నండగా.. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కాస్తా ఫిర్యాదుల వరకు వెళ్ళింది.మంత్రులు కేటీఆర్, హరీశ్‌ రావుతో పాటు పలువురు తెరాస నేతలపై తెదేపా ఈసీకి ఫిర్యాదు చేసింది. ఎన్నికల ప్రచారం సందర్భంలో వారు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్‌ను తెదేపా నేతలు రావుల చంద్రశేఖర్‌రెడ్డితో పాటు పలువురు నేతలు కలిశారు. తెదేపా అధినేత చంద్రబాబునాయుడుపై మంత్రి కేటీఆర్ వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారని.. తమ పార్టీ నేత రేవూరి ప్రకాశ్‌ రెడ్డిని మంత్రి హరీశ్‌రావు బెదిరించేలా మాట్లాడుతున్నారని నేతలు సీఈవో దృష్టికి తీసుకెళ్లారు. తెరాస అభ్యర్థులు గంగుల కమలాకర్, భూపాల్ రెడ్డి, రాజేందర్ రెడ్డి కూడా వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారని... వారిపైనా చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు.మరి ఈ మాటల యుద్ధం ఎంతవరకు వెళ్తుందో..?