కరోనాతో చ‌నిపోతే కుటుంబీకులకు జీతం.. టాటా స్టీల్ ఔదార్యం..

క‌రోనా, లాక్‌డౌన్‌ కార‌ణంగా కంపెనీల‌కు, వ్యాపారాల‌కు తాళాలు వేస్తున్నారు. బిజినెస్ దెబ్బ‌తిన్న‌దంటూ ఉద్యోగుల‌కు, కార్మికుల‌ను తీసేస్తున్నారు. 10 మంది ప‌ని చేయాల్సిన చోట ముగ్గురు సిబ్బందితోనే ప‌ని కానిచ్చేస్తున్నారు. కొవిడ్‌తో ఉపాధి, ఉద్యోగాలు కోల్పోయి దేశంలో ల‌క్ష‌లాది కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి. ఇల్లు గ‌డ‌వ‌డ‌మే క‌ష్ట‌మ‌వుతోంది చాలా మందికి. క‌రోనా కార‌ణంతో ఉద్యోగాల నుంచి అర్థాంత‌రంగా తీసేయ‌డంతో.. కొంద‌రు స్కూల్ టీచ‌ర్లు కూర‌గాయ‌లు అమ్ముకుంటున్నారు. ప్రైవేటు ఉద్యోగులు కూలి ప‌నికి పోతున్నారు. ఇలాంటి ఘ‌ట‌ల‌ను దేశ‌వ్యాప్తంగా అనేకం చూస్తున్నాము. 

ఇంత‌టి క‌రోనా సంక్లిష్ట స‌మ‌యంలోనూ తమ ఔదార్యంతో అంద‌రి మ‌న్న‌న‌లు పొందుతోంది టాటా స్టీల్ కంపెనీ. తమ సంస్థలో కరోనా బారిన పడి మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు నెల నెల జీతం య‌ధావిధిగా అందించాల‌ని నిర్ణ‌యించింది. చనిపోయిన ఉద్యోగి కుటుంబానికి.. ఆ ఉద్యోగి రిటైర్మెంట్‌ వయసు వచ్చే వరకు ప్రతి నెలా సాల‌రీ ఇవ్వ‌నుంది. ఉద్యోగి తన చివరి నెల వేతన రూపంలో తీసుకున్న మొత్తాన్ని ఆ కుటుంబీకులకు ప్రతి నెలా ఎప్ప‌టిలానే అందిస్తామ‌ని ప్రకటించింది. సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసిన ఓ ప్రకటన ద్వారా టాటా స్టీల్ కంపెనీ ఈ నిర్ణ‌యాన్ని వెల్లడించింది.   

కంపెనీలో ప‌నిచేస్తూ కరోనా బారిన పడి మరణించిన ఫ్రంట్‌లైన్ వ‌ర్క‌ర్ల పిల్ల‌ల గ్రాడ్యుయేషన్‌ చ‌దువుల‌ వరకు కంపెనీయే మొత్తం ఖర్చును భ‌రించ‌నున్న‌ది. నెల వేతనం అందించడంతో పాటు ఫ్రంట్‌లైన్ వర్కర్ల కుటుంబాలకు ఈ అదనపు సాయం కల్పించనున్నట్లు ప్రకటించారు. జంషేడ్‌పూర్‌ కేంద్రంగా పనిచేస్తున్న టాటా స్టీల్ కంపెనీ ప్ర‌క‌ట‌న‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆన్‌లైన్‌ వేదికగా నెటిజన్లు టాటా స్టీల్ నిర్ణ‌యాన్ని కొనియాడుతున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu