చిలుకా చిలుకా పలుకవా?

చిలుకా చిలుకా పలుకవా? అంటూ ఓ పాట ఉంది. బీహార్ పోలీసులు ఓ చిలుకను బంధించి  అదే పాట పాడుతున్నారు. ఆ చిలుక చేత మాట్లాడించి.. ఆ చిలుక పలుకుల ద్వారా మద్యం మాఫియా గుట్టు బయటపెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఔను నిజమే లిక్కర్ మాఫియా కేసులో పోలీసులు ఓ రామచిలుకను అదుపులోనికి తీసుకున్నారు.

ఇంతకీ ఆ రామచిలుకను ఎందుకు అరెస్టు చేశారంటే అది నిందితుల పెంపుడు చిలుకట. ఆ చిలుకను విచారించి మద్యం మాఫియా కేసును ఛేదిస్తామంటున్నారు. బీహార్ లోని గురువా పోలీసులు ఈ వింత విచారణ చేస్తున్నారు. మద్యం దందాపై విషయంలో వారు ఓ ఇంటిపై దాడి చేశారు. అయితే పోలీసుల దాడి గురించి ముందే తెలుసుకున్న నిందితులు పరారయ్యారు. దీంతో ఆ ఇంట్లో పోలీసులకు వారి పెంపుడు చిలుక మాత్రమే దొరికింది. దీంతో పోలీసులు దానిని అదుపులోనికి తీసుకున్నారు. ఇంతకీ విశేషమేమిటంటే అది మాట్లాడుతుంది.

పోలీసులు ఏ మడిగినా కటోరే.. కటోరే అంటూ బదులిస్తోంది. ఇంకా విచారిస్తే.. నిందితులకు సంబంధించి బోలెడు వివరాలు రాబట్టవచ్చని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు రామచిలుకను బంధించి విచారణ పేరున సాగిస్తున్న ప్రహసనంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.  గతంలో జానపద కథల్లో విన్నాం రాక్షసుడి ప్రాణం రామచిలుకలో ఉంది.. ఆ రామ చిలుక చెట్టు తొర్రలో ఉంది అని.. ఇప్పుడు మాత్రం నిందితుల గుట్టుముట్లన్నీ రామచిలుక నోట్లో ఉన్నాయి. ఆ రామచిలుక పోలీసు స్టేషన్ లో ఉంది అంటున్నారు. .