టీ న్యూస్ ఛానల్ కు నోటీసులు.. టీ జర్నలిస్టుల నిరసనలు
posted on Jun 20, 2015 12:31PM
.jpg)
రేవంత్ రెడ్డి నోటుకు ఓటు కేసు వ్యవహారంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆడియో టేపులను టీ న్యూస్ ఛానల్ లో ప్రసారం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ పోలీసులు నిన్న అర్ధరాత్రి టీన్యూస్ ఛానల్ కు నోటీసులు జారీ చేసింది. ఉద్దేశ్యపూర్వకంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నాలు చేస్తున్నందున వారిపై తగిన చర్యలు చేప్పట్టవలసిందిగా విశాఖపట్నంలో ప్రముఖ న్యాయవాది యన్.వి.వి. ప్రసాద్ తన పిర్యాదులో కోరారు. అయితే ఇప్పుడు ఏపీ పోలీసులు నోటీసులు జారీ చేయడంపై తెలంగాణ రాష్ట్రంలోని పది జిల్లాల జర్నలిస్టులందరూ ఏపీ డీజీపీ ఆఫీసు ముందు నిరసనలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ విషయంపై ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ స్పందించి టీ న్యూస్ ఛానల్‌కు ఏపీ పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తున్నామని.. దీనికి వ్యతిరేకంగా నిరసనలు చేపడతామని అన్నారు.
అయితే ఈ కేసుపై కేంద్రం చొరవ తీసుకుంటున్న నేపథ్యంలో సమస్య చిన్నగా పరిష్కారం అవుతుందని అందరూ అనుకుంటుండగానే మళ్లీ ఈ నిరసనలు మొదలవుతున్నాయి. రెండు రోజుల నుండి తమ దూకుడును తగ్గించిన తెలంగాణ ప్రభుత్వం ఏసీబీ అధికారులు ఇప్పుడు ఈ నోటీసుల జారీ చేయటంవల్ల మళ్లీ రెచ్చిపోతారేమో అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో కథ మళ్లీ మొదటికి వస్తుందని భావన కలుగుతోంది.