కృతజ్ఞతలు వాయిదా!
posted on Oct 27, 2013 11:07AM
.jpg)
సోనియాగాంధీ తెలంగాణా ప్రకటించడంతో ఆమెకు తామెంతో రుణపడిపోయామని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. అర్జెంటుగా ఆమెకి కృతజ్ఞతలు చెప్పేయడానికి తహతహలాడిపోతున్నారు. దీనికోసం ఆదివారం నాడు కరీంనగర్‌లోని అంబేద్కర్ స్టేడియంలో కృతజ్ఞతల సభ ఏర్పాటు చేయాలనుకున్నారు. ఈ సభలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులందరూ పాల్గొని, అమ్మగారికి కృతజ్ఞతలు తెలియజేసి, స్తోత్రాలు చెల్లించి అధిష్ఠానం దృష్టిలో పడాలని అనుకున్నారు.
అయితే కృతజ్ఞతల సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించినప్పటి నుంచి సొంత పార్టీ నుంచి మాత్రమే కాకుండా బయటి పార్టీల నుంచి కూడా విమర్శలు తలెత్తాయి. తెలంగాణ ఏర్పాటుతో అసలే కడుపు మండిపోతున్న సీమాంధ్ర ప్రజల ఆగ్రహాగ్నికి ఇలాంటి సభలు మరింత ఆజ్యం పోసే అవకాశం ఉంది కాబట్టి ఈ సభను నిర్వహించకపోవడమే ఉత్తమమన్న అభిప్రాయం కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులే వ్యక్తం చేశారు.
అయినా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు.. ముఖ్యంగా తెలంగాణ ఏర్పాటైతే తెలంగాణ సీఎం అయిపోవాలని కలలు కంటున్న తెలంగాణ మంత్రులు సోనియమ్మకి కృతజ్ఞతలు చెప్పితీరుతాం అంటూ సభ నిర్వహణకు ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు. మరోవైపు టీఆర్ఎస్ కూడా ఈ సభ మీద నిప్పులు చెరిగింది. ఏం సాధించాలరని కృతజ్ఞతలు చెబుతారని నిలదీసింది. కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణ ప్రకటించినా ముఖ్యమంత్రి స్థానంలో వున్న కిరణ్ ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అలాంటి ముఖ్యమంత్రిని కట్టడి చేయడం చేతగాని మంత్రులు ఇలాంటి సభలతో తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్నారని టీఆర్‌ఎస్ విమర్శించింది. దాంతో నాలుక్కరుచుకున్న తెలంగాణ మంత్రులు కృతజ్ఞతల సభను వాయిదా వేసుకోవాలని అనుకున్నా ఏర్పాట్లన్నీ జరిగిపోవడంతో గత్యంతరం లేక ముందుకే వెళ్దామని అనుకున్నారు. కానీ లోలోపల అనవసరంగా సభ పెడుతున్నామేమోనని మథనపడుతూనే వున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మథనను గుర్తించాడేమోగానీ, వరుణదేవుడు కరీంనగర్‌లో భారీ వర్షాలు కురిపించి అంబేద్కర్ స్టేడియంలో కాసిన్ని నీళ్ళ నిలిచేలా చేశాడు. దాంతో తె.కాం. నాయకుల బుర్రల్లో ఫ్లాష్ వెలిగింది. వెంటనే స్టేడియంలో నిలిచిన నీళ్ళ సాకుని చూపించి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కృతజ్ఞతల సభని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. సభ ఎప్పుడు జరిపేదీ తర్వాత తెలియజేస్తామని చెప్పారు.