నిమ్మగడ్డ కేసులో జగన్ సర్కార్ కు సుప్రీం కోర్టులో మరో షాక్

ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా నిమ్మగడ్డ రమేశ్ ను కొనసాగించాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు ఈ రోజు నిరాకరించింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను మీరు అమలు చేయాల్సిందేనంటూ జగన్ ప్రభుత్వాన్నిఈ సందర్భంగా ఆదేశించింది. 

ఈ సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వ తీరు పై సుప్రీం కోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. కేసులో వాదనల సందర్బంగా "అసలు ఏపీ లో ఏం జరుగుతోంది..?" అంటూ సుప్రీం కోర్టు పలుమార్లు వ్యాఖ్యానించింది. అసలు గవర్నర్ ఆదేశాలు ఇచ్చినా మీరు ఎందుకు అమలు చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. గవర్నర్ మీకు సలహాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది..? అని ఏపీ సర్కార్‌పై సుప్రీం కోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. వచ్చే శుక్రవారంలోపు హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలని సుప్రీం కోర్టు తాజాగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ సందర్భంగా జడ్జీలను, జడ్జిమెంట్‌లను ఎటాక్ చేస్తున్నారని నిమ్మగడ్డ తరుఫు లాయర్ చెప్పటంతో ఆ క్లిప్పింగ్స్ తమకు కూడా ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆయనను కోరింది. 

నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సీఎస్ కు లేఖ పంపిన సంగతి తెలిసిందే. అయితే, ఈ తీర్పు కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసు ఉందని... ఆ తీర్పు కోసం తాము వేచి చూస్తున్నామని, ఒక రాజ్యాంగ పదవి కోరుతున్న వ్యక్తి సుప్రీం తీర్పు వచ్చే వరకు ఆగలేరా అంటూ వైసీపీ నేతలు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఐతే తాజాగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఎలా అడుగు ముందుకు వేస్తుందో వేచి చూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu